కోటి సంతకాలతో కుట్రలు తిప్పికొడదాం
గోరంట్ల: ‘‘మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించేందేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కోటి సంతకాలతో కూటమి కుట్రలు తిప్పికొట్టి... ప్రజలకు మేలు చేసే మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం శుక్రవారం మల్లాపల్లి పంచాయతీ పరిధిలోని మోట్రాపల్లి, గోరంట్లలోని కొలిమి చింతమాను వీధిలో సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఉషశ్రీచరణ్ ఇంటింటికీ వెళ్లి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టం... కూటమి చేస్తున్న మోసం గురించి వివరించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయవద్దంటూ ప్రజలతో సంతకాలు సేకరించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో ఆమె మాట్లాడారు. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించే మహోన్నత లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అందులో ఐదు కళాశాలలు పూర్తయ్యాయన్నారు. మిగతా వాటిని పూర్తి చేసి పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు, నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేయాల్సిన కూటమి ప్రభుత్వం దోపిడీకి సిద్ధమైందని మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను పూర్తి చేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందని రాజకీయ కారణంతో పీపీపీ అంటూ నిరుపేదలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. మెడికల్ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. లేకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు.
12న పెనుకొండలో ర్యాలీ
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 12న పెనుకొండలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఉషశ్రీచరణ్ తెలిపారు. ఆ రోజు ఉదయం వై జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీ మెడికల్ కళాశాల వరకు సాగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులతో పాటు మేధావులు, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకించే వారంతా తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
చర్చకు సిద్ధమా సవితా?
పెనుకొండలో అభివృద్ధి పరుగులు తీస్తోందని గొప్పలు చెబుతున్న మంత్రి సవిత...నిజంగానే ఆ మాత్రం అభివృద్ధి చేసి ఉంటే తనతో చర్చకు రావాలని ఉషశ్రీచరణ్ సవాల్ విసిరారు. మంత్రి సవితకు పెనుకొండ అభివృద్ధిపై, ఈ ప్రాంత ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే మెడికల్ కళాశాల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. అంతకుముందు ఉషశ్రీ చరణ్ గుంటిపల్లి గ్రామంలో ఆకస్మికంగా మృతి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త బోయ గంగాధర్ ఇంటికి వెళ్లి మృత దేహానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, మండల కన్వీనర్ వెంకటేశు, టౌన్ కన్వీనర్ మేదరశంకరతో పాటు మండలంలోని ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించేలా ఒత్తిడి తెద్దాం
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


