రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
పుట్టపర్తి అర్బన్: పొలంలో పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికెళ్తున్న ఇద్దరు కూలీలను అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీ కొంది. ఈ ఘటనలో వారిద్దరూ చనిపోయారు. పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐ లింగన్న, ఏఎస్‌ఐ ప్రసాద్ వివరాలమేరకు.. పుట్టపర్తి మండలం పెడపల్లికి చెందిన చాకల మహేష్ (30), మాల రంగయ్య (30) వ్యవసాయ కూలి పనులకు వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు బయలు దేరారు. మరో రెండు నిముషాలు ఉంటే వారు క్షేమంగా ఇంటికి చేరేవారు. అయితే ఇంతలోనూ ఇన్నోవా రూపంలో మృత్యువు వారిని కబళించింది. పుట్టపర్తి నుంచి బెంగళూరు వైపునకు వెళ్తున్న ఇన్నోవా (ఏపీ39డీహెచ్4499) కారు అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. అదే వేగంతోనే కారు వెళ్లిపోయింది. మహేష్ , మాల రంగయ్యలను సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో ఇన్నోవా కారు నంబర్ ప్లేటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్‌ఐ సిబ్బందితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంపీపీ ఏవీ రమణారెడ్డి , మాజీ సొసైటీ అధ్యక్షురాలు ఉషారాణి, బీజేపీ మండలాధ్యక్షుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి, తదితరులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుడు రంగప్పకు ఇంకా వివాహం కాలేదు. మహేష్‌కు భార్య నందిని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరివీ పేద కుటుంబాలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు , గ్రామస్తులు కోరుతున్నారు.
బారికేడ్లు అడ్డు పెట్టినా...
జాతీయ రహదారి 342 పనులు జరుగుతుండడంతో అటు వైపు వాహనాలు రాకుండా బారికేడ్లు అడ్డుపెట్టారు. అయితే అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు వాటిని దాటుకుంటూ వచ్చి బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు కూలీలు చనిపోయారని స్థానికులు తెలిపారు. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరి కన్నీటి పర్యంతమయ్యారు. మహేష్‌కు ఇద్దరూ చిన్న పిల్లలు ఉండడంతో తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు బోరకున విలపించారు.
టీవీఎస్‌ను ఢీకొట్టి వెళ్లిపోయిన ఇన్నోవా
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి


