జెడ్పీ మాజీ చైర్మన్ దేశాయి రెడ్డెప్పరెడ్డి ఇకలేరు
తనకల్లు: కొన్ని రోజులుగా వయోభారం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దేశాయి రెడ్డెప్పరెడ్డి (87) పరాకువాండ్లపల్లిలోని తన స్వగృహంలో సోమవారం తుది శ్వాస విడిచారు. 1975లో తనకల్లు సర్పంచ్‌గా, ఆ తరువాత సమితి ప్రెసిడెంటుగా పనిచేశారు. 1981లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1984లో హిందుపూరం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 1991 నుంచి 1993 వరకు డీసీసీబీ చెర్మన్‌గా పనిచేశారు. కాగా, ఆయన అంత్యక్రియలను మంగళవారం స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ప్రముఖుల నివాళి
దేశాయి రెడ్డెప్పరెడ్డి మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరిలో వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, షాకీర్, మాజీ ఎమ్మెల్యేలు కడపల మోహన్‌రెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్‌రెడ్డి, మండల పరిశీలకులు ప్రణీత్‌రెడ్డి, మండల కన్వీనర్ అశోక్‌రెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, రామ్‌దేశాయి, శ్రీకంఠారెడ్డి, నరేంద్ర, బాలకృష్ణ యాదవ్, అబ్ధుల్ ఉన్నారు.
నిజాయితీ రాజకీయాలకు మారుపేరు
నిజాయితీ రాజకీయాలకు మారుపేరు దేశాయి రెడ్డెప్పరెడ్డి అని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి కొనియాడారు. సోమవారం వారు రెడ్డెప్పరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా పరిషత్ చైర్మెన్‌గా, డీసీసీబీ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లా అభివృద్ధితో పాటు వెనుకబడిన కదిరి ప్రాంతం అభివృద్ధికి రెడ్డెప్పరెడ్డి చేసిన కృషిని కొనియాడారు. రైతాంగ సమస్యల పరిస్కారానికి ముందుండేవారన్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. అలాగే దేశాయి రెడ్డెప్పరెడ్డి మృతి బాధాకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య ఓ ప్రకటనలో తన సంతాపాన్ని తెలిపారు.
జెడ్పీ కార్యాలయంలో
అనంతపురం టవర్‌క్లాక్: జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దేశాయి రెడ్డప్పరెడ్డి (87) మృతిపై జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జెడ్పీ కార్యాలయంలో ఆయనకు నివాళలర్పించారు. అలాగే వైస్ చైర్మన్లు వేదాంతం నాగరత్నమ్మ, కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి వేర్వేరుగా సంతాపం తెలిపారు.
జెడ్పీ మాజీ చైర్మన్ దేశాయి రెడ్డెప్పరెడ్డి ఇకలేరు


