తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
● జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం టవర్‌క్లాక్: తుపాన్ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తుపాన్ సమయంలో ఎవరూ ఇళ్లను విడిచి బయటకు వెళ్లకూడదని, విద్యుత్ తీగలు, చెట్లు, పాడుబడిన భవనాల సమీపాల్లో ఉండరాదని సూచించారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా
జస్టిస్ భానుమతి
అనంతపురం: ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కోర్టుల పనితీరు, న్యాయమూర్తుల పని తీరు, పరిశీలన, అజమాయిషీ, కేసుల పర్యవేక్షణ, న్యాయ వ్యవహారాలను పరిశీలించనున్నారు. ఇది వరకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్న జి.రామకృష్ణ ప్రసాద్ (ఏపీ హైకోర్టు న్యాయమూర్తి) శ్రీకాకుళం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా నియామకం అయ్యారు.
యువకుడి ఆత్మహత్య
సోమందేపల్లి: స్థానిక దుర్గానగర్‌కు చెందిన కుమ్మర సురేష్‌కుమార్(36) ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి జయమ్మతో కలిసి నివాసం ఉంటున్న అతను ఆదివారం సాయంత్రం తనకు పెళ్లి చేయాలని, లేకపోతే చనిపోతానంటూ ఇంట్లో ఉరివేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంతో చుట్టుపక్కల వారి సాయంతో తల్లి కాపాడింది. తిరిగి అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మృతి చెందాడు. స్థానిక పోలీస్ స్టేషన్ రౌడీషీట్ ఉండంతో పాటు చెడు అలవాట్ల కారణంగా పెళ్లి సంబంధాలు రావడం లేదని నచ్చ చెప్పిన విన కుండా ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కన్నీటి పర్యంతమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐఈఆర్‌పీల సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా భవిత కేంద్రాల్లో పని చేసే ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ల(ఐఈఆర్‌పీ) సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సోమవారం నుంచి జిల్లా సైన్స్ సెంటర్‌లో ప్రారంభమైంది. ఒక్కో మండలంలో ఇద్దరేసి చొప్పున మొత్తం 62 మంది ఐఈఆర్‌పీల సర్టిఫికెట్లను ప్రత్యేక బృందం పరిశీలించింది. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా ఐఈఆర్‌పీల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు.


