స్వాతంత్య్ర సమర యోధుడు వీఎన్ రెడ్డి కన్నుమూత
పావగడ: స్వాతంత్య్ర సమర యోధుడు, తాలూకాలోని వెంకటాపురం గ్రామానికి చెందిన వి.నరసింహారెడ్డి (103) సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. భార్య వెంకటలక్షమ్మ గతంలో మృతి చెందింది. తన సొంత ఇంట్లోనే ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఇక సెలవంటూ ఆయన వీడ్కోలు పలికారు. 1923, మార్చి 4న యర్రపరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన వీఎన్ రెడ్డి తన విద్యార్థి దశలోనే స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. తాలూకా కార్యాలయంలో బ్రిటీష్ పాలకుల చేతిలో ఉన్న రికార్డులను తగుల బెట్టడానికి ప్రయత్నించారు. పోలీసుల పహారా ఎక్కువగా ఉండడంతో ఎలుకలు పట్టుకుని వాటి తోకలకు కిరోసిన్‌తో తడిపిన దుస్తులు చుట్టి నిప్పు పెట్టి కార్యాలయంలోకి వదిలారు. కాసేపటికే మంటలు ఎగిసి పడి రికార్డులు దగ్ధ మయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్థానిక మండల పంచాయతీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పదవి చేపట్టారు. అలాగే వెంకటాపురం గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా దాదాపు 30 సంవత్సరాలు పాటు పనిచేశారు. ఆ కాలంలోనే గ్రామ పంచాయతీ పరిధుల్లో రోడ్డుకిరువైపులా చాటిన చింత చెట్లు నేడు గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులుగా మారాయి.
పలువురి నివాళి..
హిందూపురం: స్వాత్రంత్ర సమర యోధుడు వి.ఎన్.రెడ్ది ఇక లేరు అని తెలియగానే కవి సడ్లపల్లె చిదంబరరెడ్డి, రైతు సంఘం నాయకుడు ధనాపురం వెంకటరామిరెడ్డి, ఓపీడీఆర్ శ్రీనివాసులు, చైతన్య గంగిరెడ్డి, లెఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్, బహుజన చైతన్య వేదిక కోనాపురం ఈశ్వరయ్య, మాజీ కౌన్సిలర్ దాదాపీర్, తదితరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోమవారం పావగడ తాలూకా వెంకటాపురం గ్రామానికి చేరుకుని వీఎన్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు.


