‘పరిష్కార వేదిక’కు వినతుల వెల్లువ
కదిరి అర్బన్: అన్ని అర్హతలున్నా పింఛన్ మంజూరు కాలేదని ఒకరు.. తమ భూమిపై ఆన్‌లైన్‌లో మరొకరి పేరు చేర్చారని మరొకరు.. సంక్షేమ పథకాలు అందడం లేదంటూ ఇంకొకరు...ఇలా జనం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎదుట సమస్యలు ఏకరవుపెట్టారు. సోమవారం కదిరి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా స్థాయి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలపై అర్జీలిచ్చేందుకు తరలికాగా, ఆర్డీఓ కార్యాలయం కిటకిటలాడింది. మొత్తంగా 551 అర్జీలు అందగా కలెక్టర్ శ్యాంప్రసాద్ వాటిని స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపించారు.
● కదిరిలో ఈఎస్‌ఐ ఆస్పత్రి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, గార్మెంట్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు కలెక్టర్‌ను కోరారు. కదిరి ప్రాంతంలో 10 వేల మంది బీడీ కార్మికులుగా పని చేస్తున్నారని, వారికి ఈఎస్‌ఐ ఆస్పత్రి ఎంతో అవసరమని సాంబశివ, రామ్మోహన్, బాబ్జాన్ కలెక్టర్‌కు విన్నవించారు.
● గొర్రెలు మేపుకునే తనపై సెప్టెంబర్ 20వ తేదీన రత్నమయ్య అనే వ్యక్తి అత్యాచార యత్నం చేసి గాయపరిచాడని, ఫిర్యాదు చేసినా పోలీసులు న్యాయం చేయలేదని ఎన్‌పీకుంట మండలానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. అతన్ని శిక్షించి రక్షణ కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
రెవెన్యూ సమస్యలే ఎక్కువ..
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలే ఉన్నాయని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్, ఎస్పీ సతీష్‌కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రజలు ఎక్కువగా సంతృప్తి చెందడం లేదని తెలుస్తోందన్నారు. అందుకే రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, జిల్లా పంచాయతీ అధికారి సమతతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
అర్జీలలో కొన్ని..
కదిరి ఆర్డీఓ కార్యాలయంలో
జిల్లా స్థాయి కార్యక్రమం
కలెక్టర్ శ్యాంప్రసాద్,
ఎస్పీ సతీష్‌కుమార్ హాజరు
అర్హులమైనా పింఛన్, పథకాలు అందలేదంటూ జనం ఆవేదన
పింఛన్ మంజూరు చేయండి..
నాలుగేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ఇంటిపెద్ద మృతితో మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కుటుంబ జీవనం ఇబ్బందిగా మారింది. వితంతు పింఛన్ కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా...మంజూరు కావడం లేదు. ఇప్పటికై నా నాపై దయ ఉంచి పింఛన్ మంజూరు చేయండి.
– శాంతాబాయి, చవిటింతండా, కదిరి మండలం
ఇల్లు మంజూరు చేయండి..
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం మాది. నేను, నా కుమారుడు గిరి, అతని భార్య, ముగ్గురు పిల్లలు కలిసి ఉంటున్నాం. మాకు సొంతంగా స్థలం ఉంది. ఇల్లు మంజూరు చేస్తే మాకో నీడ దొరుకుతుంది. దయచేసి ఇల్లు మంజూరు చేసి ఆదుకోండి. – వెంకటరమణ,
యర్రగుంట్లపల్లి, కదిరి మున్సిపాలిటీ
వైకల్యశాతం తగ్గిస్తున్నారు..
రీవెరిఫికేషన్ పేరుతో వైద్యులు ఇష్టానుసారం దివ్యాంగుల వైకల్యశాతాన్ని తగ్గిస్తున్నారు. గతంలో సదరం ద్వారా 100 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ పొందిన వారికీ 50, 60 శాతం నమోదు చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన వైకల్యశాతం నమోదు చేస్తున్నారో కూడా చెప్పడం లేదు. దీనివల్ల వేలాది మంది పింఛన్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతున్నారు. వైద్యులు పక్కాగా వైకల్య శాతం నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలి. – ఇంతియాజ్,
వికలాంగుల సంఘం అధ్యక్షుడు, కదిరి


