ఉపాధిలో ‘పచ్చ’ మేత | - | Sakshi
Sakshi News home page

ఉపాధిలో ‘పచ్చ’ మేత

Oct 27 2025 7:11 AM | Updated on Oct 27 2025 7:11 AM

ఉపాధి

ఉపాధిలో ‘పచ్చ’ మేత

జిల్లాలో ఉపాధిహామీ గణాంకాలు..

మొత్తం జాబ్‌ కార్డులు 2,59,895

ఉపాధి కూలీల సంఖ్య 4,76,217

పనులకు వెళ్లే కూలీల సంఖ్య 3,83,025

ఈ–కేవైసీ పూర్తయినవారు 1,52,315

ఫీల్డ్‌ అసిస్టెంట్లు 520

కదిరి: కూటమి ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ కార్యకర్తల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అప్పటి వరకు పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ‘వైఎస్సార్‌సీపీ’ ముద్ర వేసి తొలగించారు. ఎన్నికల్లో తమ గెలుపు కోసం పనిచేసిన వారిని ఎమ్మెల్యేల సిఫార్సుతో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా నియమించారు. వీరి ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కార్యకర్తలు సైతం ఎంతోమంది ఉపాధి హామీ పనులకు వెళ్లకుండానే డబ్బులు దండుకుంటున్నారు. అలా వారి ఖాతాల్లో డబ్బు జమయ్యేలా చేసినందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు సైతం కొంత డబ్బు తీసుకుంటున్నారు. జిల్లాలో 15 వేల మందికి పైగా బోగస్‌ కూలీలు ఉన్నట్లు పలు సామాజిక తనిఖీల్లో బయటపడింది. వీరు పనులకు వెళ్లకుండానే డబ్బు కాజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పసిగట్టింది.

అక్రమాలకు ముకుతాడు ఇలా...

అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త విధానాలను తీసుకొచ్చింది. ఉపాధి కూలీల ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్‌–నో యువర్‌ కస్టమర్‌) తీసుకొని ఆధార్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఈ విధానంతో ఒకరి తరఫున మరొకరు హాజరైతే యాప్‌ అనుమతించదు. ఉపాధి పనులు జరిగే చోట సిబ్బంది అక్కడి కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. పనికి రాగానే ఒకసారి, నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటోలు తీసి వాటిని నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కూలీల వేతన చెల్లింపులకు ఈ ఫొటోలు తప్పనిసరి. తర్వాతి రోజు ఫొటోలు అప్‌లోడ్‌ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అదేరోజు అప్పటికప్పుడే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఒకరిద్దరితో వేర్వేరు ఫొటోలతో ఎక్కువ మంది పనికి హాజరైనట్లు మస్టరు నమోదుకు కూడా వీల్లేకుండా ఏఐ సాయంతో పటిష్ట చర్యలు చేపట్టారు. కూలీల గోల్‌మాల్‌కు ప్రయత్నిస్తే ఏఐ ఇట్టే పసిగట్టేస్తుంది. అదే జరిగితే సంబంధిత ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను తక్షణం తొలగిస్తారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారు.

ఇకపై పీడీఓల పర్యవేక్షణ

రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల పేరును పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(పీడీఓ)గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై వీరు కూడా ఉపాధి పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు తీసే ఉపాధి కూలీల ఫొటోలను పీడీఓలు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీఓకు నివేదిక సమర్పిస్తారు. మండల వ్యాప్తంగా వచ్చిన వాటిలో 20 శాతం ఫొటోలను ఎంపీడీఓ జిల్లా అధికారుల పరిశీలన కోసం పంపుతారు. వారు వీటిని జాగ్రత్తగా స్టోర్‌ చేయాల్సి ఉంటుంది.

పనులు చేయకున్నా కార్యకర్తలకు బిల్లులు

బోగస్‌ రికార్డులతో ఫీల్డ్‌ అసిస్టెంట్ల మాయ

కూటమి పాలనలో బరితెగించి మరీ అక్రమాలు

చెక్‌ పెట్టేందుకు నిబంధనలు కఠినం చేసిన కేంద్రం

పనిచేసే చోట రెండుసార్లు హాజరు.. కూలీల ఫొటోలపై పీడీఓల నిఘా

చిలమత్తూరు మండలంలోని ఓ పంచాయతీలో ఉపాధి హామీ పనులకు 112 మంది కూలీలు వెళ్తే.. బిల్లులు మాత్రం 180 మంది అందుకుంటున్నారు. వీరంతా టీడీపీ కార్యకర్తలే. అంటే ఉపాధి పనులకు వెళ్లకపోయినా ప్రతి వారం వీరి బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతోంది.

ముదిగుబ్బ మండలంలోనూ పలువురు టీడీపీ కార్యకర్తలు ఉపాధి పనులకు వెళ్లకుండానే డబ్బులు అందుకుంటున్నారు. ఇలా వారి ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చేసినందుకు సదరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు సైతం కొంత వాటా తీసుకుంటున్నారు.

... ఇలా జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులకు వెళ్లకుండానే డబ్బులు దండుకుంటున్న ‘పచ్చ’ గ్యాంగ్‌ 15,550 మంది ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి వారి అక్రమాలను కట్టడి చేసేందుకు కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది.

పని చేస్తేనే పైసలు

ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అందరికీ ఈ–కేవైసీ చేయిస్తున్నాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు నిజమైన కూలీలకు న్యాయం జరుగుతుంది. అవినీతికి ఏమాత్రం అవకాశం ఉండదు. నిజంగా పని చేసే వారి బ్యాంకు ఖాతాలకే ఇకపై పైసలు జమ అవుతాయి.

–విజయప్రసాద్‌, పీడీ, డ్వామా

ఉపాధిలో ‘పచ్చ’ మేత 1
1/1

ఉపాధిలో ‘పచ్చ’ మేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement