టీడీపీలో తారస్థాయికి విభేదాలు
చిలమత్తూరు: మండలంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నాయకులు తమ ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయంలో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా ఆదివారం టీడీపీలోని రంగారెడ్డి వర్గం నేతలు ఎమ్మెల్యే పీఏలను కలిశారు. పార్టీలు మారే వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని తెగేసి చెప్పారు. చిలమత్తూరు పంచాయతీ సర్పంచ్ టికెట్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో చిలమత్తూరు బరిలో నాగరాజు యాదవ్ సోదరుడు లక్ష్మినారాయణ యాదవ్‌ను దింపాలనే యోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మరోవర్గం బీసీలలో పార్టీ కోసం తొలినుంచి కష్టపడిన వారికి సర్పంచ్‌గా అవకాశం ఇవ్వాలని పీఏల వద్ద ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ముందు నుంచి టీడీపీలో ఉన్న నేతలంతా ఒక గ్రూపుగా పీఏలను కలవడంపై మరో గ్రూపు గుర్రుగా ఉంది. అయితే సాయంత్రం రంగారెడ్డికి చెందిన పెట్రోల్ బంక్ వద్దకు కొందరు వ్యక్తులు చేరుకొని దుర్భాషలాడి, గొడవ పడినట్టుగా తెలిసింది. ఇదంతా యాదవ్ సోదరులు చేయించారని రంగారెడ్డి తన అనుచరగణంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పార్టీలో విభేదాలు మరోమారు బయటపడ్డాయి. ఏడాది కిందట మొదలైన విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరాయి. ఇన్నాళ్లూ ఆదాయాలపై దృష్టి సారించిన తమ్ముళ్లు ‘స్థానిక’ సమరం దగ్గర పడుతుండటంతో దృష్టంతా ‘స్థానిక’ అధికారంపై పడింది. దీంతో టికెట్‌లు తమ వర్గానికంటే తమ వర్గానికని బహిరంగంగానే ప్రకటించుకుంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.
మాజీ కన్వీనర్ రంగారెడ్డి వర్సెస్ నాగరాజు యాదవ్
పోలీసు స్టేషన్‌కు చేరిన ‘పంచాయితీ’


