తాగి గొడవలు చేస్తే రౌడీషీట్ తెరుస్తాం
●ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరిక
హిందూపురం: రాత్రి వేళల్లో తాగి గొడవలు, అల్లర్లకు పాల్పడితే రౌడీషీట్ నమోదు చేస్తామని ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారిౖపైనెనా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీలు మహేష్, నరసింగప్ప నేతృత్వంలో 120 మంది పోలీసు సిబ్బందితో పదికి పైగా బృందాలు ఆదివారం తెల్లవారుజాము నుంచే హిందూపురంలోని గుడ్డం, త్యాగరాజనగర్ తదితర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రెండు డ్రోన్ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ డివైజెస్, ఫింగర్‌ప్రింట్ స్కానర్లు తదితర టెక్నాలజీని వినియోగించారు. ఈ సందర్భంగా అనుమానితుల ఇళ్లు, పరిసరాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. లైసెన్సులు, రికార్డులు లేని 77 ద్విచక్ర వాహనాలు, 7,ఆటోలు సీజ్ చేశారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రజా జీవనం శాంతియుతంగా కొనసాగాలన్నారు. రాబోవు రోజుల్లో జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలోనూ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామన్నారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల్లో సీఐలు రాజగోపాల్ నాయుడు, అబ్దుల్ కరీం, జనార్దన్, ఆంజనేయులు, రాజ్‌కుమార్, ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.


