బదిలీల్లో ఘోర పరాభవం | - | Sakshi
Sakshi News home page

బదిలీల్లో ఘోర పరాభవం

Sep 4 2025 6:15 AM | Updated on Sep 4 2025 6:15 AM

బదిలీల్లో ఘోర పరాభవం

బదిలీల్లో ఘోర పరాభవం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇప్పటికే రోజుకో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు, కింది స్థాయి కేడర్‌కు మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పోరు పతాక స్థాయికి చేరినట్లు తెలిసింది. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఎంపీ మాట నెగ్గే పరిస్థితి లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఎంపీలు డమ్మీలుగా మారారని, ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని టీడీపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. టీటీడీ లెటర్లు ఇవ్వడానికి మినహా దేనికీ పనికిరావడం లేదంటున్నారు.

మా అనుమతి లేనిదే..

ఎలాంటి అనధికార కార్యక్రమాలకూ తమకు తెలియకుండా ఎంపీలు వెళ్లడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేలు హుకుం జారీచేశారు. తాజాగా అనంతపురం అర్బన్‌లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాతూరు మార్కెట్‌ పరిశీలనకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేకు, ఎంపీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘నా అనుమతి లేకుండా వెళ్లడానికి మీరెవరు’ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి విరుచుకుపడినట్టు తెలిసింది. తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, కదిరి వంటి నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో కూడా ఎంపీలకు తెలియదు! నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టులు కానీ, కేటాయింపులు చేసే అధికారాలు కూడా ఎంపీలకు లేవు. ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యేలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇసుక, మట్టి, మద్యం ఇలా ఏదైనా కానీ ఎంపీలకు దక్కడానికి వీల్లేకుండా చేశారు. ‘పేరుకే ఎంపీ.. అంతా ఎంప్టీ’ అన్న చందాన తయారైంది పరిస్థితి. ఇటీవల శింగనమల నియోజకవర్గంలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ తమకొద్దంటూ టీడీపీ కార్యకర్తలే ధర్నా చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది.

ఆయనకు అడుగడుగునా..

హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చివరి నిమిషంలో ఇచ్చింది చాలు అన్నట్టు ఎంపీ సీటు దక్కించుకుని గెలిచినా.. ఉమ్మడి జిల్లాలో ఆయన మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదు. ఇక.. సొంత నియోజకవర్గం పెనుకొండలో అయితే మంత్రి సవితకు, ఎంపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఏ పనిలోనూ ఎంపీకి చిన్న భాగస్వామ్యం కూడా లేదు. కదిరి, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్థసారథి మాట చెల్లుబాటు కావడం లేదని ఆయన వర్గీయులు వాపోతున్నారు.

ఎంపీలను లెక్కచేయని శాసనసభ్యులు

అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకూడదని హుకుం

ఇటీవల ఎంపీ అంబికాతో అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ఢీ

శింగనమలలో ఎంపీపై టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు

పెనుకొండలో మరీ ఘోరంగా ఎంపీ పార్థసారథి పరిస్థితి

ఆవేదనలో ఎంపీల అనుచరులు

టీటీడీ లెటర్లకు తప్ప ఎందుకూ ఉపయోగపడటం లేదని నిట్టూర్పు

ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రభుత్వ సిబ్బందికి ఇచ్చిన సిఫార్సు లేఖల్లో ఎంపీల సిఫార్సు లేఖలు బుట్టదాఖలయ్యాయి. నియోజకవర్గంలో తమ సిఫార్సు కాదని ఎంపీల సిఫార్సు లేఖలు తీసుకోవద్దంటూ అధికారులకు ఎమ్మెల్యేలు హుకుం జారీచేశారు. చివరకు ఎంపీ ల్యాడ్స్‌ కింద పనులు చేసినా తమ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. కాబట్టి తమకు వాటా దక్కాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో బయటకు చెప్పుకోలేక, ఎమ్మెల్యేలను ఎదుర్కొనే శక్తి లేక ఎంపీలు లోలోపల కుమిలిపోతున్నారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా అధిష్టానం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో నలిగిపోతున్నారు. తమకంటే నామినేటెడ్‌ పోస్టులు దక్కించుకుంటున్న వారే నయమని ఎంపీలు సన్నిహితులతో వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement