
వ్యక్తిపై కత్తితో దాడి
హిందూపురం: మండలంలోని మలుగూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. వివరాలు.. సోమందేపల్లి మండలం పోలేపల్లికి చెందిన నరసింహులు మరో వ్యక్తితో కలసి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా మలుగూరు రైల్వేస్టేషన్ సమీపంలో వెనుక నుంచి మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అటకాయించి మలుగూరు గ్రామానికి దారి అడిగారు. చెబుతుండగానే కత్తితో దాడి చేశారు. ఆ సమయంలో కేకలు వేయడంతో దుండగులు ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. అక్కడకు చేరుకున్న స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలిచంఆరు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండు ఇళ్లల్లో చోరీ
లేపాక్షి: మండలంలోని మైదుగోళం గ్రామంలో మంగళవారం రాత్రి రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. పది రోజుల క్రితం గ్రామంలో చోటు చేసుకున్న హత్య నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన శాంతమ్మ, బేబీ శ్యామల కుటుంబాలు ఈ 5న గ్రామాన్ని వీడిపోయాయి. తాళం వేసిన ఇళ్లను గుర్తించిన దుండగులు మంగళవారం రాత్రి లోపలకు చొరబడి బంగారు నగలతో పాటు, కిరాణా దుకాణంలోని నగదునూ అపహరించారు. విషయం తెలుసుకున్న బాధితులు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
అమరాపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. వివరాలు.. అమరాపురంలోని గాడి దొడ్డయ్య ఇంటి సమీపంలో ఉన్న చింత చెట్టులో ఉన్న తుట్టె నుంచి తేనెను సేకరించేందుకు బుధవారం అదే గ్రామానికి చెందిన యువకులు తిప్పేస్వామి (35), గిరీష్ సిద్ధమయ్యారు. చెట్టు ఎక్కి తేనె తుట్టె వైపుగా సాగుతుండగా చెట్టు మధ్యలో నుంచి వెళ్లిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలి షాక్‌కు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తిప్పేస్వామి మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన గిరీష్‌కు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. కాగా, కుమారుడు మృతితో ఒంటరిగా మారిన తల్లి పుట్టమ్మ వేదనకు అంతులేకుండా పోయింది.

వ్యక్తిపై కత్తితో దాడి