
కోవూరు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి హేయం
చిలమత్తూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరుమాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు చేసిన దాడిని హిందూపురం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఖండించారు. దాడిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. బుధవారం హిందూపురంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వందలాది టీడీపీ గూండాలు మూకుమ్మడిగా ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దారుణాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డిని హతమార్చేందుకే ఈ దాడి జరిగినట్లుగా కనిపిస్తోందన్నారు. తమ కంటి ముందే విధ్వంసం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. దాడికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ పర్యటనలో
పోలీసుల తీరు అమానుషం
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా బరితెగించడం సిగ్గుచేటని టీఎన్ దీపిక మండిపడ్డారు. మామిడి రైతులను పరామర్శించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు వెళ్లిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపై పోలీసులు విధించిన ఆంక్షలు చూస్తుంటే సీఎం చంద్రబాబు భయపడ్డారనేది స్పష్టమవుతోందన్నారు. పోలీసులను ఉసిగొల్పి రైతులను భయభ్రాంతులకు గురి చేసేలా లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు. ఈ దుశ్చర్యను బట్టి చూస్తే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని అర్థం అవుతోందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేసులు బనాయించినా, బెదిరింపులకు దిగినా రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ వెంటే ఉంటారనే విషయం ఈ పర్యటనతో స్పష్టమైందన్నారు. ఇప్పటికై నా వైఎస్ జగన్‌పై ఉన్న ప్రజాభిమానాన్ని గుర్తించి తమ నిరంకుశ ధోరణికి స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు హితవు పలికారు.
వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ధ్వజం