
బొలెరో.. బైక్ ఢీ: ఇద్దరు మృతి
బత్తలపల్లి: అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై బత్తలపల్లి బైపాస్ రోడ్డులోని వేల్పుమడుగు క్రాస్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. మండలంలోని గంటాపురం గ్రామానికి చెందిన ఓబిలేసు(38) శనివారం ఉదయం తన బైక్‌పై బత్తలపల్లి నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. ఇదే సమయంలో పీర్లను దర్శించుకునేందుకు గంటాపురం వెళ్లేందుకు రోడ్డుపై ఉన్న సదాశివ(32)ను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. వీరి వాహనం బత్తలపల్లి బైపాస్ వద్ద వేల్పుమడుగు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో అనంతపురం నుంచి తమిళనాడుకు జీవాలతో వెళ్తున్న బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వారిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్, ఏఎస్‌ఐ సోమశేఖర్‌మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను హైవే అంబులెన్స్‌లో ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గంటాపురం గ్రామస్తులు, మృతుల బంధువులు సంఘటనాస్థలానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్జీవంగా ఉన్న తమ వారిని చూసి వారంతా కన్నీరు మున్నీరయ్యారు. ఓబిలేసుకు భార్య రమణమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సదాశివకు భార్య శివకాంతతో పాటు ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బొలెరో.. బైక్ ఢీ: ఇద్దరు మృతి

బొలెరో.. బైక్ ఢీ: ఇద్దరు మృతి