సీహెచ్‌సీలో స్వీపర్ ఆత్మహత్యాయత్నం
గోరంట్ల: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో ఔట్ సోర్సింగ్ కింద స్వీపర్‌గా పనిచేస్తున్న లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలు తెలిపిన మేరకు.. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో శుభ్రత చేసే అంశంపై తరచూ లక్ష్మిని హెడ్‌నర్సు మల్లమాంబ వేధింపులకు గురి చేస్తూ ఉండేది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆస్పత్రిలో పనిలో నిమగ్నమైన లక్ష్మిని ఆక్షేపిస్తూ మల్లమాంబ తీవ్ర స్థాయిలో మందలించింది. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మి... అక్కడే ఉన్న నిద్ర మాత్రలు మింగింది. విషయాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే వైద్యాధికారి ఉష దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన వైద్యులు ఆగమేఘాలపై ఆమెకు చికిత్స అందజేసి, ప్రాణాలు కాపాడారు. ఈ విషయమై డాక్టర్ ఉష ను వివరణ కోరగా లక్ష్మి తన విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో హెడ్ నర్సు మల్లమాంబ మందలించడం వాస్తవమని, చిన్నపాటి అంశానికి ఆమె నిద్ర మాత్రలు మింగిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
పోక్సో కేసు నమోదు
బుక్కరాయసముద్రం: మండలంలోని గోవిందపల్లి పంచాయతీలో ఇద్దరు బాలురపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు, పుల్లయ్య తెలిపారు. వివరాలను మంగళవారం వారు వెల్లడించారు. రాఘవేంద్ర కాలనీలో 3వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల వయస్సు కలిగిన ఇద్దరు బాలురు మాయ మాటలతో నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించారు. దీంతో బాధితుడు ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకోవడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం ఇద్దరు బాలురపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫ్యాక్టరీలో చోరీ.. నిందితుల అరెస్ట్
హిందూపురం: స్థానిక తూముకుంట పారిశ్రామిక వాడలోని స్వస్తిక్ ఫ్యాక్టరీలో ఐరన్ అపహరించిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 22న ఫ్యాక్టరీలో రూ.1.50లక్షల విలువ చేసే ఐరన్‌ను దుండగులు అపహరించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో తూముకుంటకు చెందిన ఆటో డ్రైవర్ అర్ఫాత్‌షాషా, పరిశ్రమలో పనిచేస్తున్న యూపీలోని బల్దియా జిల్లా పర్వత్‌పూర్‌కు చెందిన దేవానంద్, చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌కు చెందిన యశ్వంత్ సాహును మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వీరి నుంచి 25 కిలోల బరువున్న 32 బండిళ్ల బైండింగ్ వైర్, 20కేజీల తూకం వేసే 33 రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
రేపటి నుంచి జీవాలకు టీకాలు
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకలకు మంగళవారం నుంచి ఉచితంగా టీకాలు (వ్యాక్సినేషన్) వేసే కార్యక్రమం మొదలవుతుందని పశుసంవర్ధక శాఖ రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీ డీఎల్) ఏడీ డాక్టర్ రవిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలకర్లు ప్రారంభం కావడంతో వర్షాకాలంలో సాధారణంగా వ్యాపించే నట్టలు (డీవార్మింగ్), నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్), థైలేరియాసీస్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49 లక్షలు గొర్రెలు, 9 లక్షల మేకలు... మొత్తంగా 58 లక్షల జీవాలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌కేల వేదికగా శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేపట్టడానికి పారాస్టాప్‌తో బృందాలు ఏర్పాటు చేశామన్నారు.


