
‘వెన్నుపోటు దినం’ విజయవంతం చేద్దాం
పుట్టపర్తి: రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4న నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, వైఎస్సార్ సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని హిందూపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు రెడ్డప్పగారి రమేష్‌రెడ్డి, పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వారు పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో జిల్లాలోని అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు అసమర్థ పాలన, హామీలు విస్మరించిన వైనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు పసుపు–కుంకుమ, రైతు రుణ మాఫీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, పీఠంపై కూర్చోగానే మహిళలకు, రైతులకు వెన్నుపోటు పొడిచారన్నారు. గత ఎన్నికలకు ముందు ‘సూపర్ సిక్స్’ హామీలతో పాటు వందల హామీలిచ్చి చంద్రబాబు పొత్తులతో అధికారంలోకి వచ్చారని, ఇప్పుడూ హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. మోసం, వంచన, వెన్నుపోటు చంద్రబాబు నైజమన్నారు. 1996లోనే బిడ్డినిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అక్రమంగా పదవి పొందారని, 2024లో అధికారంలోకి వస్తూనే ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 4వ తేదీ పుట్టపర్తి దద్దరిల్లిల్లేలా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలన్నారు.
మోసం చేయటమై చంద్రబాబు లక్ష్యం..
హామీలివ్వడం.. మోసం చేయడం చంద్రబాబు నైజమని వెన్నపూస రవీంద్రరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4వ తేదీన ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో జరిగే ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణ, పుట్టపర్తి రూరల్ మండల ఎంపీపీ రమణారెడ్డి, జిల్లా అగ్రీ అడ్వయిజరీ మాజీ అధ్యక్షుడు ఆవుటాల రమణారెడ్డి, పుట్టపర్తి వైస్ చైర్మన్ తిప్పన్న, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షులు కన్యా కుమారి, కవితారెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగిశెట్టి, పుట్టపర్తి నియోజకవర్గం డాక్టర్ల విభాగం అధ్యక్షుడు హనుమంతరెడ్డి, సాయి, రామాంజనేయులు, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షుడు గంగిరెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు బడా నాగార్జునరెడ్డి, కొత్తచెరువు ఐటీ విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ హిందూపురం
పార్లమెంట్ పరిశీలకులు
రమేష్‌రెడ్డి
హామీలు తుంగలో తొక్కడం
చంద్రబాబు నైజం:
వెన్నపూస రవీంద్రారెడ్డి