
రాజకీయాల కోసం జీవితాలతో ఆడుకోవద్దు
చిలమత్తూరు: ‘‘వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యం చేసుకుని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అధికారం ఉంది కదా అని చెలరేగి పోతున్నారు. దీనివల్ల మీకు వచ్చే లాభం ఏమిటోగానీ బాధిత కుటుంబాలు పడే కష్టాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటున్నాయి. రాజకీయాల కోసం జీవితాలతో ఆడుకోవద్దు’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ టీడీపీ నేతలకు హితవు పలికారు. క్రికెట్ బంతి కోసం పాఠశాల భవనంపైకి ఎక్కగా అక్కడే ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్ కుమారుడు అశ్విన్ ఆరాధ్య మృతి చెందిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసుతో వాల్మీకి లోకేష్ హిందూపురం సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నారు. దీంతో శనివారం వైఎస్సార్ సీపీ నాయకులు కోర్టుకు వెళ్లి వాల్మీకి లోకేష్‌కు కండీషన్ బెయిల్ తెచ్చారు. ఈ సందర్భంగా సబ్‌జైలు వద్ద హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపికతో కలిసి ఉషశ్రీచరణ్ మీడియాతో మాట్లాడారు. తండ్రి జైలులో కాకుండా ఇంట్లోనే ఉండి ఉంటే ఆ బాలుడు అశ్విన్ అటువైపు వెళ్లి మరణించేవాడు కాదేమోనన్నారు. బిడ్డ మరణవార్త విని అస్వస్థతకు గురైన లోకేష్ ఒకవైపు ప్రభుత్వాసుపత్రిలో చేరడం, అదే ఆస్పత్రిలో తన బిడ్డ విగతజీవిగా ఉండటం బాధాకరమైన విషయమన్నారు. కోర్టు ఆదేశాలతో కండీషన్ బెయిల్ రావడంతో లోకేష్‌కు తనబిడ్డ ఆఖరి చూపు చూసుకునే అవకాశం దక్కిందన్నారు. లోకేష్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతోనే బాలుడు అశ్విన్ మరణించాడని, దీనికి విద్యుత్‌శాఖ అధికారులు బాద్యత వహించాలన్నారు.
అక్రమ కేసులు అన్యాయం
నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మాట్లాడుతూ...వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేతల అక్రమ కేసులు అన్యాయమన్నారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే పోలీసులు కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా కేసులు నమోదుచేసి జైలుకు పంపుతున్నారన్నారు. మోహన్ అనే వ్యక్తి వల్ల లోకేష్ జైలు పాలయ్యారన్నారు. దీనివల్ల అతను సాధించినది మాత్రం ఓ కుటుంబానికి నష్టం చేకూర్చడమేనన్నారు. అయినా చేయని తప్పుకు లోకేష్‌పై అక్రమంగా కేసు బనాయించారన్నారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి నేతలు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లోకేష్‌తో పాటు వైఎస్సార్ సీపీ నేతలను అక్రమ కేసులలో ఇరికించి జైలుకు పంపారన్నారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని, అక్రమ కేసులు బనాయించిన పోలీసులను కోర్టుముందు నిలబెడతామన్నారు.
అక్రమ కేసులు పెట్టి వేధించడం
మానుకోండి
టీడీపీ నేతలకు ఉషశ్రీ చరణ్ హితవు
వాల్మీకి లోకేష్ కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి
అశ్విన్ ఆరాధ్యకు కన్నీటి నివాళి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపీక, నాయకుడు వేణురెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి తదితరులు సబ్‌జైలు నుంచి వాల్మీకి లోకేష్‌ను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం కన్నీటి నివాళుల మధ్య వాల్మీకి లోకేష్ తనయుడు అశ్విన్ ఆరాధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు లోకేష్‌కు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి, వైఎస్సార్ సీపీ కురబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, ఆ పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు మహేష్‌గౌడ్, నాగరాజు, చిలమత్తూరు మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, నక్కలపల్లి శ్రీరామిరెడ్డి, ధనుంజయరెడ్డి, శివశంకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఐటీ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు గిరీష్‌రెడ్డి, సురేష్‌కుమార్‌రెడ్డి, వెంకటరెడ్డి, కవిత, శ్రీనివాసరెడ్డి పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజకీయాల కోసం జీవితాలతో ఆడుకోవద్దు