
అపేరిసిస్ పరికరం
● సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ ఉచితంగా
అందించే అవకాశం
● ప్రైవేటుగా ఈ సేవ పొందాలంటే రూ.11వేల నుంచి రూ.14 వేల ఖర్చు
అనంతపురం మెడికల్: వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సేవలు అందుబాటులోకి తీసుకొస్తోంది. పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే అనంతపురం సర్వజనాస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో ‘అపేరిసిస్’ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఉపయోగమిదే...
డెంగీ, మలేరియా, హై బీపీ తదితర సమస్యలున్న వారిలో ఒక్కోసారి ప్లేట్‌లెట్స్ అమాంతంగా పడిపోతాయి. అలాంటి వారికి సాధారణ ప్లేట్ లెట్స్ నాలుగు యూనిట్లు ఎక్కిస్తే 40 వేల నుంచి 50 వేల ప్లేట్‌లెట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే సింగిల్ డోనల్ ప్లేట్‌లెట్స్ ఒక్క యూనిట్ ద్వారా అదే స్థాయిలో ప్లేట్‌లెట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అపేరిసిస్ పరికరం ద్వారానే ఈ సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ అందించాల్సి ఉంటుంది. గతంలో ఈ పరికరం లేక రోగులు ప్రైవేటుగా సేవలు పొందాల్సి వచ్చేది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇందుకు రూ.8,000 ఖర్చవుతుండగా, ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో అయితే రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకూ సమర్పించుకోవాల్సి వచ్చేది. అయితే, పేదలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. అందులో భాగంగానే పెద్దాస్పత్రిలో రూ.24 లక్షలు విలువ చేసే అపేరిసిస్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోగులపై ఎలాంటి భారం పడకుండా సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ ఉచితంగా అందించనుంది. ప్రైవేటు ఆస్పత్రుల వారికి కూడా తక్కువ ధరకే సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ అందిస్తారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు సూచించారు.