
ధర్మవరం అర్బన్: విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరంలోని రామ్‌నగర్‌కు చెందిన దీక్షిత్ (3వ తరగతి), ధర్మతేజ (5వ తరగతి) స్నేహితులతో కలసి ఆదివారం సాయంత్రం క్రికెట్ ఆడుకుంటుండగా బంతి నేరుగా వెళ్లి ఓ ఇంటి బాత్‌రూంపై పడింది. దీంతో దీక్షిత్, ధర్మతేజ మిద్దె ఎక్కి కడ్డీ సాయంతో బంతిని తీస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ లైన్ తగిలి షాక్‌కు గురయ్యారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యువకుడి
అనుమానాస్పద మృతి
ధర్మవరం రూరల్: మండలంలోని పోతులనాగేపల్లికి చెందిన కొండ్రెడ్డి భాస్కరరెడ్డి (24) అదే గ్రామ సమీపంలోని వంకలో ఆదివారం మృతదేహమై కనిపించాడు. వివరాలు... గ్రామానికి చెందిన అంజినమ్మ, నారాయణరెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు భాస్కర్‌రెడ్డి గ్రామ సమీపంలోని పొలాల వద్దకు మూడు రోజుల క్రితం పశువులను మేపు కోసం తీసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రం పశువులు మాత్రమే ఇంటికి వచ్చాయి. భాస్కర్‌రెడ్డి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. రెండు రోజులుగా గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వంకలోని నీటిలో భాస్కరరెడ్డి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. గమనించిన స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా కేసు మోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
వజ్రకరూరు: మండలంలోని గూళ్లపాళ్యం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న వజ్రకరూరు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. 48 సంవత్సరాల వయసు ఉంటుందని, టీ షర్టు, నీలం రంగు డ్రాయర్ ధరించినట్లు వెల్లడించారు. కుడిచేతికి గాయమైన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. వ్యక్తి మృతదేహాన్ని గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి మార్చరీకి తరలించినట్లు పేర్కొన్నారు.

గాయపడిన దీక్షిత్