గుత్తి రూరల్: పొలానికి వెళ్లేందుకు దాయాదులు దారి విడువక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం రాంపురానికి చెందిన ఆదినారాయణ, సావిత్రమ్మ దంపతుల రెండోకుమారుడు కాయల రామచంద్ర (26)కు సమీప బంధువులతో పొలం రస్తా విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం గుత్తి మండలం కొత్తపేట సమీపంలో తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను తొలగించి దిగుబడిని ఇంటికి తరలించేందుకు రామచంద్ర సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న దాయాదులు రస్తాకు అడ్డు వేయడంతో మూడు రోజులుగా ఎద్దులబండి అక్కడే ఆగిపోయింది. ఆదివారం మరోసారి దాయాదులతో రామచంద్ర మాట్లాడాడు. అయినా వారు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రామచంద్ర నేరుగా ఇంటికెళ్లి పురుగుల మందు డబ్బా తీసుకుని పొలం వద్దకు చేరుకుని తాగాడు. అటుగా వెళుతున్న వారు గమనించి సమాచారం అందించడంతో పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రామచంద్రను గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామచంద్ర మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి ఆదినారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.