పుట్టపర్తి: బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి యత్నించిన యువకుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి రాజ్యలక్ష్మి మంగళవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే... బుక్కపట్నం గ్రామానికి చెందిన ఓ బాలిక తన తల్లి సూచన మేరకు ఇంటి సమీపంలోని ఓ జనరల్ స్టోర్‌లో బర్ఫీ కొనుగోలు చేసేందుకు 2021 మార్చి 6వ తేదీ రాత్రి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న బుక్కపట్నం గ్రామానికి చెందిన బెస్త మహేష్ (29) బాలిక చేయిపట్టుకొని పక్కకు లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే బాలిక గట్టిగా అరవడంతో చుట్టు పక్కలవారు పరిగెత్తుకుని అక్కడికి రాగా, మహేష్ పారిపోయారు. ఘటన అనంతరం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా బుక్కపట్నం ఎస్‌ఐ మహేంద్రభూపతి కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసును పీపీ విద్యాపతి వాదించగా... పోక్సో కోర్టు జడ్జి రాజ్యలక్ష్మి 8 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో ముద్దాయి మహేష్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ. లక్ష నష్ట పరిహారం చెల్లించాలని తీర్పులో వెల్లడించారు. దోషులను శిక్ష పడేలా సాక్షులను ప్రవేశపెట్టిన ఎస్‌ఐ నరసింహులు, కోర్టు పీసీ శివయ్యను ఎస్పీ మాధవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.