
పొలంలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ అరుణ్‌బాబు, అధికారులు
పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన పంటలన్నీ ‘ఈ–క్రాప్’లో నమోదు చేయాలని, ఈప్రక్రియ ఈనెల 30వ తేదీలోపు పూర్తికావాలని కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావుతో కలిసి పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి, బీడుపల్లి, జగరాజుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ‘ఈ– క్రాప్’లో వ్యవసాయ అధికారులు నమోదు చేసిన వివరాలను ‘మాస్టర్ చెక్’ చేశారు. నేరుగా పొలాల వద్దకే వెళ్లి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతు సాగు చేసిన పంటలను వ్యవసాయాధికారులు, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి యాప్‌లో నమోదు చేయాలన్నారు. బయోమెట్రిక్ ద్వారా దీన్ని ధ్రువీకరించాలన్నారు. పంటల వారీగా విస్తీర్ణం నమోదు చేయాలని, పొలంలోకి వెళ్లి జియో ఫెన్షింగ్ ద్వారా ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ–క్రాప్ తర్వాత రైతులతో ఈ–కేవైసీని సైతం పూర్తి చేయించాలన్నారు. రసీదులను మ్యాన్యువల్‌గా అందజేయాలన్నారు. అంతకుముందు కలెక్టర్ జగరాజుపల్లికి చెందిన రైతు గంగాద్రి మొక్కజొన్న పంట, బ్రాహ్మణపల్లిలో రైతు చంద్రశేఖర్‌రెడ్డి సాగుచేసిన వరిమడి, బీడుపల్లిలో రైతు వెంకటరమణ సాగు చేసిన మొక్కజొన్న పంటలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ భాగ్యరేఖ, తహసీల్దార్ నవీన్‌కుమార్, ఏఓ వెంకటబ్రహ్మం, సిబ్బంది ఉన్నారు.