
మ్యాచ్ తిలకిస్తున్న మాంఛో ఫెర్రర్, కలెక్టర్ గౌతమి, ఎంపీ కోటగిరి శ్రీధర్
అనంతపురం: అనంతపురంలో ఫుట్‌బాల్ సందడి మొదలైంది. 15 రోజుల ఫుట్‌బాల్ క్రీడా పండుగకు ఆర్డీటీ క్రీడా గ్రామం వేదికైంది. సబ్ జూనియర్ బాలుర జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్–2023 పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 20 రాష్ట్రాల జట్ల క్రీడాకారులు తరలివచ్చారు. ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, కలెక్టర్ గౌతమి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛూ ఫెర్రర్ ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని, పోటీలను ప్రారంభించారు. తొలిరోజు పోటీల్లో త్రిపుర, అసోం జట్లు గెలిచి శుభారంభం చేశాయి. ఏపీ–సిక్కిం, తమిళనాడు–బిహార్ జట్ల మధ్య మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. విద్యార్థులు, క్రీడాభిమానులు హాజరై ఫుట్‌బాల్ పోటీలను తిలకించారు.
మ్యాచ్‌ల వివరాలు..
● ఆంధ్రప్రదేశ్, సిక్కిం జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ 1–1 గోల్‌తో డ్రాగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున సాత్విక్ గోల్ సాధించాడు.
● అండమాన్ నికోబార్ దీవుల జట్టుపై త్రిపుర జట్టు మూడు గోల్‌లు చేసి విజయం సాధించింది.
● హిమాచల్‌ప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏడు పాయింట్లతో అసోం జట్టు సాధించింది. హిమాచల్‌ప్రదేశ్ ఒక్క గోల్ కూడా సాధించలేక చతికిలపడింది.
● తమిళనాడు, బిహార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1 గోల్‌తో డ్రా అయ్యింది.
సబ్ జూనియర్ బాలుర జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం
తొలిరోజు విజేతలు త్రిపుర, అసోం
ఏపీ–సిక్కిం, తమిళనాడు–బిహార్ మ్యాచ్‌లు డ్రా

ఆంధ్రప్రదేశ్– సిక్కిం జట్ల మధ్య మ్యాచ్