నిబంధనలు ఇవీ..

హిందూపురానికి చెందిన శ్రీరాములు వెన్నెముక సమస్యతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. కలుషిత నీరు తాగడం కారణంగా సమస్య తలెత్తినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇంటికి సమీపంలోని వాటర్ ప్లాంట్ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నట్లు చెప్పారు. అయితే అనారోగ్యం బారిన పడతాననే విషయం పసిగట్టలేదని వాపోయారు.
కదిరి పట్టణానికి చెందిన నారాయణప్ప కీళ్ల నొప్పులతో ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షలు చేసిన అనంతరం తాగునీటి కారణంగా సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఓ ప్రైవేటు వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ఇంటి వద్దకే వచ్చి క్యాన్ విక్రయిస్తున్నట్లు తెలిపారు. కీళ్ల నొప్పులు వస్తాయని ఆలోచించలేదన్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
సాక్షి, పుట్టపర్తి: జలం.. గరళంగా మారుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు కలుషిత నీటిని విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లతో ఎంతో మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
మొద్దునిద్రలో అధికారులు..
పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం, కదిరి, మడకశిర పట్టణాల్లో సుమారు 100 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో కనీసం 20 వాటర్ ప్లాంట్లకు కూడా అనుమతులు లేవు. ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకోవాలి. కానీ ఓసారి అనుమతి తీసుకుని యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. పల్లెల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లు ఉండటంతో ఎలాంటి సమస్య లేదని చెబుతున్నారు. అయితే పట్టణాల్లో ప్రైవేటు వాటర్ ప్లాంట్ల కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని చెబుతున్నారు. మినరల్ వాటర్ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నా.. మామూళ్ల మత్తులో అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి.
● ప్లాంట్ నిర్వహణకు బీఎస్‌ఐ అనుమతి ఉండాలి. ఐఎస్‌ఐ నిబంధనలు పాటించాలి.
● పరిశ్రమలశాఖ నుంచి పార్టు–1 లైసెన్సు పొందాలి.
● ప్రయోగశాలతో పాటు ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి.
● ప్లాంట్‌కు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాలి.
● మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి.
● ప్రతీ క్యాన్‌పై శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ నంబర్ ఉండాలి.
● క్యాన్లను రోజూ పొటాషియం పర్మాంగనేట్‌తో శుభ్రపరచాలి.
● మినరల్ వాటర్‌ను క్యాన్‌లో పెట్టే ముందు అల్ట్రా వైరస్ రేస్‌తో శుద్ధి చేయాలి.
● రెండు రోజుల పాటు నీటిని నిల్వ చేసి తర్వాత మార్కెట్‌లోకి పంపించాలి.
● నీటిని క్యాన్‌లో నింపేవారు చేతులకు గ్లౌజులు వినియోగించాలి.
● శుద్ధి చేసిన నీటిని 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీలుతో తయారు చేసిన పెద్ద ట్యాంకులో నింపి ఓజోనైజేషన్ చేయాలి.
● పీహెచ్ స్థాయి ఏడు కంటే తగ్గకుండా చూసుకోవాలి. తగ్గితే ఆ నీరు తాగిన వారికి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
● ప్రతి మూడు నెలలకు ఓసారి రా వాటర్ టెస్టింగ్ జరపాలి. ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లలో నిర్ణీత మైక్రోన్స్ ఉండాలి. కానీ జిల్లా వ్యాప్తంగా ఇందులో ఏ ఒక్క నిబంధన కూడా వాటర్ ప్లాంట్ నిర్వాహకులు పాటిస్తున్న దాఖలాలు లేవు.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న
మినరల్ వాటర్ ప్లాంట్లు
నిబంధనలు తుంగలో తొక్కి
ప్రజలకు నీటి సరఫరా
అనారోగ్యం బారిన జనం
మామూళ్ల మత్తులో అధికారులు
తనిఖీలు చేపడతాం
వాటర్ ప్లాంట్ల పనితీరుపై ఎప్పటికప్పుడు వివరాలు ఆరా తీస్తున్నాం. రెన్యువల్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నాం. నిబంధనలు పాటించని వారికి నోటీసులు ఇస్తున్నాం. తనిఖీలు చేపట్టి.. కలుషిత నీరు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.
– రామచందర్, ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి