
మృతుల కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ధర్మవరం: ఆప్తులను కోల్పోయి పుట్టెదు దుఃఖంలో మునిగిన వారికి ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. మార్చి 17న బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ఆటో, బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలిచింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం ఆరుగురికి రూ.30 లక్షల చెక్కులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి పంపిణీ చేశారు. ఆదివారం స్థానిక తన నివాసంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి బాధితులతో మాట్లాడారు. చిరు వ్యాపారులు, కూలీల మృతి తనను కలచి వేసిందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యమందేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రమాద విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సాయం విడుదల చేశారన్నారు. బాధిత కుటుంబాలకు ఏ అవసరమొచ్చినా అండగా ఉంటానన్నారు. సాయమందుకున్న బాధితులు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ యర్రగుంట భాగ్యలక్ష్మి, కౌన్సిలర్ చందమూరి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు
రూ.30 లక్షల సాయం
చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి