
అనంతపురం డెస్క్ :
వేసవి సెలవులు సమీపిస్తున్నాయి. పరీక్షలు పూర్తవగానే ఎంచక్కా టూర్లకు వెళ్లడానికి పిల్లలు ఉత్సాహం చూపుతున్నారు. అందుకు అనుగుణంగానే పెద్దలు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. కొందరు షిర్డీ, ఊటీ, గోవా వంటి సుదూర ప్రాంతాలను సందర్శించడానికి ఆసక్తి చూపుతుండగా..మరికొందరు వారి ఆర్థిక స్తోమతను బట్టి ఉమ్మడి జిల్లా పరిధిలోనే, లేదంటే చుట్టుపక్కల జిల్లాల్లో మంచి ప్రదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రకృతి రమణీయతను, ఆధ్యాత్మికతను పంచే సందర్శనీయ ప్రాంతాలు మన చుట్టుపక్కలే ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం...
ఆధ్యాత్మిక ధామం పుట్టపర్తి..
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిని సందర్శిస్తే వేరే దేశంలో ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. అద్భుతమైన నిర్మాణాలు, హాయిగొలిపే వాతావరణం, అణువణువూ గోచరించే సాయితత్వం మనకు కొత్త అనుభూతి ఇస్తాయి. చైతన్యజ్యోతి మ్యూజియం, నక్షత్రశాల, హిల్‌వ్యూ స్టేడియం, డీమ్డ్ యూనివర్సిటీ, భారీ ఆంజనేయుడి విగ్రహం వంటివి ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు.
●ప్రకృతి అందాల ఆలూరు కోన..
రంగనాథస్వామి కొలువైన ఆలూరు కోన తాడిపత్రికి 5 కి.మీ.దూరంలో ఉంది. రెండు కొండల మధ్య నుంచి పెద్దనీటి బుగ్గ ఉత్తర–దక్షిణ దిశగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆలూరు కోనకు వెళ్లేవారు తాడిపత్రిలోని చింతల వేంకటరమణస్వామి, బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయాలను కూడా సందర్శించొచ్చు. ఇవి పురాతన ఆలయాలు.
విజయనగర చరిత్రకు సాక్షీభూతం పెనుకొండ
విజయనగర వైభవాన్ని, నాటి చరిత్రను తెలుసుకోవడానికి పెనుకొండ సందర్శన ఉపయోగపడుతుంది. కొండపైనున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, గగన్‌మహల్, బాబయ్య దర్గా, కుంభకర్ణ విగ్రహం, తిమ్మరుసు బందీఖానా, పార్శ్వనాథుడు, అజితనాథ ఆలయాలు సందర్శనీయ ప్రదేశాలు.
●‘రికార్డు’ మర్రి చూడాల్సిందే!..
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన తిమ్మమ్మ మర్రిమాను ఎన్‌పీకుంట మండలం గూటిబైలులో ఉంది. కదిరి నుంచి 26 కి.మీ. దూరంలో ఉండే ఈ మర్రిమాను ప్రస్తుతం 8.75 ఎకరాల్లో విస్తరించింది. 6,689 ఊడలు ఉన్నాయి. ఇది 1989లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. తిమ్మమ్మ మర్రిమాను చూడడానికి వెళ్లేవారు మార్గమధ్యంలోని కదిరి పట్టణంలో గల ఖాద్రీ లక్ష్మీనృసింహాలయాన్ని, కటారుపల్లిలోని యోగివేమన సమాధిని కూడా సందర్శించవచ్చు.
●శత్రుదుర్భేద్యం .. గుత్తికోట
బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉండే గుత్తి కోటను అప్పట్లో శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. దాదాపు 25 హెక్టార్ల విస్తీర్ణంలో శంకు ఆకారంలో కోట ఉంటుంది. ముఖద్వారం నుంచి బురుజు వరకు 101 బావులు, 15 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఇక్కడి ఆలయాలు, కారాగారం, సొరంగ మార్గాలు, కోడిగుడ్డు బావి, ఏనుగు, గుర్రపుశాలలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
●ఆహ్లాదాన్ని పంచే పెన్నహోబిలం
ఉరవకొండ మండలంలోని పెన్నహోబిల క్షేత్రం మంచి వేసవి విడిది. ఇక్కడి లక్ష్మీనృసింహుడి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుండగా..చెంతనే ఉండే జలపాతం ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇక్కడికి కొద్దిదూరంలోనే పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) ఉంది. ప్రస్తుతం ఇది జలకళతో కనువిందు చేస్తోంది.
●అబ్బురపరిచే బెలూంగుహలు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూంగుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని భూగర్భశాస్త్రవేత్తల అంచనా. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత వీటినే రెండవ అతిపెద్ద గుహలుగా పరిగణిస్తున్నారు. ఇవి తాడిపత్రి పట్టణానికి కేవలం 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. గుహల లోపలికి వెళ్లిరావడం జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోతుంది.
●హంపీ అందాలు వీక్షించాల్సిందే
అనంతపురం నుంచి హంపీ కేవలం 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగర రాజధానిగా విరాజిల్లిన హంపీలో ఎన్నో చూడదగిన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తరం వైపు తుంగభద్ర నది, మిగతా మూడువైపులా చారిత్రక కట్టడాలతో హంపీ అలరారుతోంది. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయ సముదాయం, శిలా రథం, గజ శాల వంటివి కనువిందు చేస్తాయి.
●నయనమనోహరం నంది కొండలు
కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లాలో ఉన్న నందికొండలపై నుంచి సూర్యోదయాన్ని తిలకించడం దివ్యానుభూతికి లోను చేస్తుంది. కొండపై నుంచి చూస్తే మేఘాలపై నుంచి కిందకు చూస్తున్నట్టుంది. బెంగళూరు– హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)కి సమీపంలోనే ఉండే నందికొండలకు అనంతపురం నుంచి రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. అనంతపురం నుంచి దూరం 178 కి.మీ. మాత్రమే. ఈ వేసవిలో చిన్నారులను నందిహిల్స్‌కు తీసుకెళితే అక్కడి ప్రకృతి రమణీయతను ఎంతగానో ఆస్వాదిస్తారనడంలో అతిశయోక్తిలేదు.
గూటిబైలులోని తిమ్మమ్మ మర్రిమాను
పెన్నహోబిలంలోని ఉగ్రనరసింహస్వామి విగ్రహం
సమీపిస్తున్న వేసవి సెలవులు
టూర్లకు సిద్ధమవుతున్న పెద్దలు, పిల్లలు
ఉమ్మడి అనంతలో అద్భుతమైన
పర్యాటక ప్రాంతాలు
చుట్టుపక్కలా రమణీయ క్షేత్రాలు
తక్కువ ఖర్చుతోనే సందర్శించే అవకాశం

ఆలూరు కోన
