
కనగానపల్లి: దాదులూరు పోతలయ్యస్వామి జాతరలో కీలకమైన గావుల మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామునే భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్చించారు. అనంతరం ఉరుముల శబ్దాలు, పోతరాజుల విన్యాసాల నడుమ 15 మేకపోతు పిల్లలను బలిచ్చి స్వామికి రక్తతర్పణం చేశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దాదలూరు కిక్కిరిసిపోయింది. అనంతరం పలువురు భక్తులు ఆలయం ముందు పోట్టేళ్లు, మేకపోతులను బలిచ్చి స్వామికి మొక్కులు సమర్పించుకున్నారు.
జనంతో కిక్కిరిసిన పరుష..
దాదులూరు పరుష జనంతో కిక్కిరిసిపోయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు భక్తులు పోతలయ్యస్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ఆలయంలో క్యూలైన్లతో పాటు చుట్టూ ఉన్న పరుష ప్రాంతం జనంతో నిండిపోయింది. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకొన్న పోలీస్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బందికి ఆలయ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యేక అలంకరణలో పోతలయ్యస్వామి మూలవిరాట్, ఆలయం వద్ద భక్తుల సందడి