కూటమికి కంట్లో నలుసుగా మారిన పర్వతరెడ్డి | - | Sakshi
Sakshi News home page

కూటమికి కంట్లో నలుసుగా మారిన పర్వతరెడ్డి

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

రెడ్‌బుక్‌ రాజ్యాంగం, భూముల నుంచి సర్కారు కొలువుల కుంభకోణాలే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అరాచకాలు సాగుతున్నాయి. వీటిని ప్రశ్నించే గొంతుకులను నులిమేసే విధంగా ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్ట్‌లు, తప్పుడు కేసులతో అణచివేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. అధికార మదంతో రాజకీయ రాక్షసం ప్రదర్శిస్తున్నాడు. తన శాఖలో డీఎస్సీ కుంభకోణానికి తెరతీసిన నేపథ్యంలో ఆధారాలతో సహా వెలుగెత్తి చాటిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని టార్గెట్‌ చేసి ఆయన విద్యా సంస్థల్లో తనిఖీలతో వేధింపులు ప్రారంభించాడు. తన సహచర మంత్రి నారాయణ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతుల్లేకుండా తరగతి గదులు, హాస్టళ్ల నిర్వహిస్తుంటే లోకేశ్‌కు ‘కంపట్లేదు’.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అలవికాని హామీలిచ్చి.. అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వంలో మంత్రి లోకేశ్‌ షాడో సీఎంగా రాజ్యాంగేతర శక్తిగా అరాచక పాలన సాగిస్తున్నాడు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కొలేక.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో రాజకీయ కక్ష సాధింపులతో తాలిబన్లను మించిన క్రూరత్వం ప్రదర్శిస్తున్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజావ్యతిరేకత అణచివేసేందుకు లేని కుంభకోణాలు సృష్టించి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌లతో జనం దృష్టిని మరల్చి మెగా డీఎస్సీ పేరుతో పోస్టుల భర్తీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. ఈ కుంభకోణానికి సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల పక్కా ఆధారాలతో మీడియా ముఖంగా వెల్లడించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రాజకీయంగా తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను రాజకీయంగా ఎదుర్కొలేక నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి నారాయణ మంత్రి లోకేశ్‌తో కలిసి రాజకీయ కుట్రలకు తెరతీశారు. దొడ్డి దారిన బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన కృష్ణచైతన్య జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌బోర్డు అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేయడం జిల్లాలో రాజకీయ చర్చకు దారి తీసింది.

కృష్ణచైతన్య కళాశాలల్లోనే తనిఖీలు

జిల్లాలో నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా విద్యా భవనాలు, తరగతి గదులు, హాస్టళ్లు నిర్వహిస్తున్నాయి. కానీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడిని టార్గెట్‌ చేసి కేవలం ఆయనకు చెందిన నెల్లూరులోని కృష్ణచైతన్య జూనియర్‌ కళాశాలలతో పాటు బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న జూనియర్‌ కళాశాలలో శనివారం రాత్రి ఇంటర్‌బోర్డు ఆర్జేడీ పద్మ, జిల్లా ఇంటర్‌బోర్డు ప్రాంతీయ విద్యాశాఖాధికారి వరప్రసాదరావు తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు తనిఖీలతో హడావుడి చేశారు. సిబ్బంది, ఉద్యోగులను పలు రకాల ప్రశ్నలతో వేధింపులకు గురి చేశారు. కళాశాలలకు సంబంధించిన అనుమతులు, ల్యాబ్‌లు, ఫైర్‌ సర్టిఫికెట్‌ తదితర పత్రాలను అడిగి తీసుకున్నారు. మరో రెండు రోజుల్లో నోటీసులు జారీ చేసే యోచనలో ఇంటర్‌బోర్డు అధికారులు ఉన్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారంటూ వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా.. నోరు మెదపని, కాలు కదపని ఇంటర్‌ బోర్డు అధికారులు ఉన్నపళంగా కేవలం కృష్ణచైతన్య విద్యా సంస్థల్లోనే తనిఖీలు చేయడంపై రాజకీయంగా ఆయన్ను ఎదుర్కొలేకనే కక్షపూరితంగా ప్రభుత్వ పాలకులు వ్యవహరిస్తున్నారని స్పష్టమైంది.

నారాయణ విద్యా సంస్థల అక్రమాలు

‘కంపట్లేదా’?

జిల్లాలో మంత్రి నారాయణకు చెందిన జూనియర్‌ కళాశాలలకు సంబంధించి నిర్వహిస్తున్న హాస్టల్స్‌ల్లో ఏ ఒక్క హాస్టల్‌కు ప్రభుత్వ అనుమతి లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లను తలపించే విధంగా కళాశాలల భవనాలు ఉన్నాయి. అన్ని కళాశాలల్లో సైన్స్‌ ల్యాబ్‌లు, మైదానాలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా క్యాంటీన్‌లు నిర్వహిస్తున్నారు. హాస్టల్స్‌కు అనుమతులు లేకున్నా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఆయా విద్యా సంస్థల అక్రమాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా.. కళ్లముందు కనిపిస్తున్నా.. ఇంటర్‌బోర్డు అధికారులకు కనబడక పోవడం, చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఏ రోజూ నారాయణ జూనియర్‌ కళాశాలలను తనిఖీలు చేసిన పాపాన పోలేదు. పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడి కేవలం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా ఉండడంతో కృష్ణచైతన్య విద్యా సంస్థలను టార్గెట్‌ చేశారని స్పష్టంగా అర్థమవుతోంది.

డీఎస్సీ కుంభకోణంపై వెలుగెత్తిన

ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి

విద్యాసంస్థలపై లోకేశ్‌ టార్గెట్‌

కృష్ణచైతన్య కళాశాలలపై

ఇంటర్‌ బోర్డు అధికారుల తనిఖీలు

ఆరు జూనియర్‌ కళాశాలల్లో

అర్ధరాత్రి వరకు సాగిన తనిఖీలు

అనుమతులు, పత్రాలు

చూపించాలంటూ హడావుడి

అనుమతులు లేకుండా హాస్టల్స్‌

నిర్వహిస్తున్న నారాయణ

వాటి జోలికి వెళ్లని ఇంటర్‌ బోర్డు అధికారులు

రాజకీయంగా ఎదుర్కొలేక

కృష్ణచైతన్యపై దాడులు

నగర నియోజకవర్గంలో

యాక్టివ్‌గా పనిచేస్తున్న ఎమ్మెల్సీ

అది చూసి తట్టుకోలేక పోతున్న

మంత్రులు లోకేశ్‌, నారాయణ

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారారు. కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతి అక్రమాలను ఎండగడుతున్నారు. మండలిలో వైఎస్సార్‌సీపీ గొంతుకుగా మారి.. కల్తీ నెయ్యి ముసుగులో హెరిటేజ్‌ టీటీడీ నిధుల దోపిడీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన తీరును, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ తల్లికి వందనం మోసాలు, విద్యా కిట్ల పంపిణీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యాదీవెన పథకాలను అమలు చేయకపోవడం, ఉపాధ్యాయులను వేధిస్తున్న వైనం, మెగా డీఎస్సీ కుంభకోణం, స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలను నిలదీస్తూనే ఉన్నారు. అమరావతి భూముల కుంభకోణంపై మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో వైఎఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఓట్లు తొలగింపుపై పోరాడుతున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ చేస్తున్న నెల్లూరులో వీఆర్‌ పాఠశాల నుంచి పచ్చదనం పేరుతో సాగిస్తున్న అవినీతి, అక్రమాలు, ఆయన అనుచరుల దౌర్జన్యకాండపై ఎప్పటికప్పుడు మీడియా ముఖంగా బట్టబయలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థలో ఏకపక్షంగా కొత్త డివిజన్ల పెంపు, పునర్విభజన అస్తవ్యస్తంగా చేయడంపై హైకోర్టును ఆశ్రయించి పోరాటం చేస్తున్నారు. కూటమి రెండేళ్లుగా సాగిస్తున్న వెన్నుపోటు పాలనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు చేస్తున్న ఆందోళనలకు ప్రజాస్పందన వెల్లువెత్తుతోంది. ఇటీవల టీడీపీ నుంచి డివిజన్ల వారీగా వందల కుటుంబాలు చంద్రశేఖర్‌రెడి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరడంతోపాటు ఆయనకు జైకొట్టడాన్ని మంత్రి నారాయణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ను రాజకీయంగా తట్టుకోలేని అధికార పార్టీ పెద్దలతోపాటు మంత్రి నారాయణ రాజకీయ కక్ష సాధింపులకు తెరలేపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement