నేడు 21మంది ఎమ్మెల్సీల నెల్లూరుకు రాక | - | Sakshi
Sakshi News home page

నేడు 21మంది ఎమ్మెల్సీల నెల్లూరుకు రాక

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

నెల్లూరురూరల్‌: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం బరి తెగింపు చర్యలను ఎండగట్టేందుకు రాష్ట్రంలోని 21మంది ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సోమవారం నెల్లూరుకు వస్తున్నారని పార్టీ జిల్లా కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మెగా డీఎస్సీ కుంభకోణంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ పాత్రపై ఆధారాలతో సహా వెల్లడించిన నేపథ్యంలో కక్ష గట్టిన ప్రభుత్వ పెద్దలు చంద్రశేఖరరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయనకు చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థల్లోనే తనిఖీలు చేసి, వేధింపులకు గురి చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అండగా మేమున్నామనే భరోసా కల్పించేందుకు ఎమ్మెల్సీలు వస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సైతం చంద్రశేఖర్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు.

డయల్‌ యువర్‌ ఎస్‌ఈ, సీఎండీ నేడు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నగరంలోని విద్యుత్‌ భవన్‌లో.. డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమాన్ని తిరుపతిలోని కార్పొరేట్‌ కార్యాలయంలో సోమ వారం నిర్వహించనున్నారు. డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమానికి సంబంధించి 0861 – 2320427 నంబర్‌ను ఉదయం 8.30 నుంచి 9.30లోపు సంప్రదించి సమస్యలను తెలియజేయొచ్చు. అదే విధంగా డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమానికి గానూ 89777 16661 నంబర్‌ను ఉదయం పది నుంచి 12.30లోపు సంప్రదించి సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశముంది.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

నెల్లూరు (టౌన్‌): యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగాను జీవనశైలిగా మార్చుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, కమిషనర్‌ నందన్‌, డిప్యూటీ డైరక్టర్‌ మాధురి, మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, జిల్లా పర్యాటక శాఖాధికారి అజర్‌ఆలీ, డీఎస్డీఓ జసీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

యోగాతో మంచి ఆరోగ్యం

నెల్లూరు(లీగల్‌): యోగాతో ఎంతో ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిత్య జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఉంటాయని, వాటిని అధిగమించి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే యోగాతోనే సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి మహత్తరమైన యోగా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్‌ జడ్జి వైజే పద్మశ్రీ, న్యాయమూర్తులు పీజే సుధా, శుభవాణి, పరశురామ్‌, శ్రీనివాస్‌, భరద్వాజ్‌, సులోచనరాణి, సాయిరామ్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సత్తు అంకయ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, న్యాయశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 93,303 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 41,688 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement