సామాన్యుడిపై ధరాఘాతం | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడిపై ధరాఘాతం

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

మండుతున్న కూరగాయల రేట్లు

పేద, మధ్య తరగతి వర్గాలపై పెనుభారం

నెల్లూరు(వేదాయపాళెం): కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. కొన్నిరకాల కూరగాయల కేజీ ధర వంద రూపాయలు దాటేస్తోంది. ప్రభుత్వ పర్యవేక్షణాలోపం, నిర్లక్ష్య ధోరణులతో అన్ని వర్గాలకు అవసరమైన నిత్యావరాల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలను సాకుగా చూపి కొందరు వ్యాపారులు వినియోగదారుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. పప్పు దినుసులు, కిరాణా వస్తువులు సైతం ప్రతి నెలా పెరుగుతున్నాయి. సామాన్యుడి ఆదాయ వనరులు మాత్రం పెరగకపోవడంతో ధరాఘాతంతో పేద, మధ్య తరగతి వర్గాలు జీవనం కష్టమవుతుంది.

నగరంలో ఇలా..

నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్‌లో గత నెలలో రూ.30లు ధర ఉన్న కొన్ని రకాల కూరగాయలు ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం వంకాయలు కేజీ రూ.100కుపైగా, బీరకాయ రూ.50, పందిరి చిక్కుళ్లు రూ.90, బీన్స్‌ రూ.70, గోరు చిక్కుళ్లు రూ.80, క్యాబేజీ రూ.40, కాలీఫ్లవర్‌ ఒక్కటి రూ.50 ధర పలుకుతున్నాయి. ఇటీవల వరకు కేజీ రూ.50 నుంచి రూ.60 వరకు ధర పలికిన టమాటాలు ప్రస్తుతం రూ.20లకు దొరకడం విశేషం.

రిటైల్‌ దుకాణాల్లో మరింత..

ఏసీ మార్కెట్‌లో కేజీ రూ.30లకు విక్రయించే సమయంలోనే వీధుల్లోని రిటైల్‌ దుకాణాల్లో పావు కేజీ రూ.20 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తారు. ప్రస్తుతం కేజీ రూ.80 నుంచి రూ.100 వరకు ధర పలుకుతుండడంతో రిటైల్‌ దుకాణాల్లోని ధరలకు అంతే ఉండదని పేద, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అర కేజీ కంటే తక్కువ పరిమాణంలో మార్కెట్‌లో విక్రయించరు. అందువల్ల తమకు కావల్సిన పావుకేజీ, అంతకంటే తక్కువ తూకంతో చిల్లర దుకాణదారుడు విక్రయిస్తుండంతో ధర అధికమైనా తమ ప్రాంతంలో రిటైల్‌ దుకాణంలో ప్రజలు కొనుగోలు చేస్తుంటారు.

ప్రభావం చూపుతున్న పెట్రో ధరలు

దేశంలోనే అత్యధికంగా పెట్రోల్‌, డిజిల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. నగరంలోని కూరగాయల మార్కెట్‌లకు ప్రధానంగా కర్ణాటకలోని కోలార్‌, గుంటూరు జిల్లాలోని ముదిగుబ్బ, ఉల్లి అయితే మహారాష్ట్ర నుంచి చేరుతుంటాయి. ఈ సరుకు రవాణాలో డీజిల్‌ వినియోగం అధికంగా ఉంటుంది. ఆ ప్రభావం కూరగాయలపై పడి సామాన్యులకు ధరాఘాతం తప్పడం లేదు.

తూకాల్లో మోసాలు

ఏసీ మార్కెట్‌లోని కొన్ని దుకాణాల్లో తూకాల్లో మోసాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. సంబంధిత ఎలక్ట్రానిక్‌ కాటాలను అడ్జస్ట్‌ చేసి కేజీకి 850 నుంచి 900 గ్రాముల్లోపు మాత్రమే వచ్చే విధంగా విక్రయాలు సాగిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

మోసాలు చేస్తే చర్యలు

వినియోగదారునికి కచ్చితమైన కొలతలతో దుకాణదారులు విక్రయించాల్సి ఉంటుంది. తూకంలో మోసం జరిగినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– అనితకుమారి, ఏడీ, మార్కెటింగ్‌ శాఖ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement