కూటమి పాలనలో రైతులు విలవిల | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో రైతులు విలవిల

Mar 10 2026 7:12 AM | Updated on Mar 10 2026 7:12 AM

ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించాలి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

తోటపల్లిగూడూరు(పొదలకూరు) : ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు విలవిలాడిపోతున్నారని, జిల్లాలో వరికోతలు ప్రారంభమైన నేపథ్యంలో ఒకటి రెండ్రోజుల్లోనే ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. తోటపల్లిగూడూరు మండలం ఈదూరులో సోమవారం ఆయన పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకుడు తూపిలి సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులకు కష్టాలు తప్పవన్నారు. 850 కేజీల పుట్టి ధాన్యం రూ.20,300 ఉండాల్సి ఉండగా, రూ.19 వేలకు పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. కూటమి నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని రాజకీయాల్లో లాగారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే పథకం ప్రకారం తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు భ్రష్టుపట్టిపోయారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అప్పులు కుప్పలుగా మారినట్టుగా కాగ్‌ నివేదిక తేటతెల్లం చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ, గత ప్రభుత్వ పాలనల్లోని తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. రాబో యేది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభ్యం అవుతుండడంతో నేరాలు బాగా పెరుగుతున్నాయన్నారు. గుమ్మళ్లదిబ్బ, వరిగొండ అఘాయిత్యాలు పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగాయని విమర్శించారు. సస్పెండ్‌ అయిన పోలీసు అధికారులపై లోతుగా విచారణ జరిపితే శాశ్వతంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉంటుందన్నారు. వారి హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలపై విచారణ జరిపితే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. పోలీసులు సంఘవిద్రోహులపై నిఘాపెట్టకుండా వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టేందుకు సమయం వెచ్చించడం వల్లే అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో శాంతిభద్రతలు లోపించాయని, వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులను పెట్టేందుకు ఆసక్తి చూపుతూ శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలమవుతున్నారన్నారు. తోటపల్లిగూడూరుకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని త్వరలో పరామర్శించి ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. ఆయన వెంట పార్టీ నేతలు టంగుటూరు పద్మనాభరెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్‌, వంశీకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యంగౌడ్‌, తలమంచి సురేంద్రబాబు, చిరంజీవిగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement