పొగమంచు వేళ జర భద్రం
● రహదారులను కమ్మేస్తున్న వైనం
● జాగ్రత్తలు తప్పనిసరి
రాత్రి వేళలో ఇలా..
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో రోజురోజుకు వాతావరణం శీతలంగా మారుతోంది. మరోవైపు పొగమంచు కమ్మేస్తోంది. పొగమంచు వాహనదారులను భయపెడుతోంది. ఉదయం 9 గంటల వరకూ మంచు వీడటం లేదు. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రయాణ సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాల బారిన పడక తప్పదు. ఇలాంటి తరుణంలో ప్రయాణం సాగించేవారు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు సాగించరాదు. వాహనచోదకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవచ్చు.
ప్రమాదాలకు కారణాలు..
సాధారణ పరిస్థితుల్లో ప్రయాణాలు.. పొగమంచు వేళల్లో ప్రయాణాలకు చాలా తేడా ఉంటుంది. ఈ సమయంలో దట్టంగా అలుముకున్న మంచువల్ల వాహనచోదకులకు మార్గం, ఎదురు వాహనాలు, రోడ్డుపక్కగా నిలిపిన వాహనాలు కనిపించకపోవడం, అధిక వేగం, ఓవర్‌టేక్ చేయడం అధిక శాతం ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి.
ఇలా చేయాలి..
వాహన సామర్థ్యం సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. వైపర్లు, లైట్లు, ఇండికేటర్లు, బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయా.. లేదా? అనేది పరిశీలించుకోవాలి.
సొంత కార్లు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు సాధ్యమైనంత వరకు అర్ధరాత్రి, తెల్లవారుజాము ప్రయాణాలు మానేయడం మంచిది.
కారు (విపత్తు హెచ్చరిక) నాలుగు వైపుల ఉన్న లైట్లను ఆన్‌చేయాలి. దీంతో రహదారిపై కారు ఉనికిని ఇతర వాహనాలు గుర్తించే అవకాశం ఉంటుంది.
వాహనాల ముందు, వెనుక అద్దాల మీద మంచు పేరుకున్నప్పుడు రహదారి సరిగా కనిపించదు. అద్దాలను పొడిగుడ్డతో తుడుచుకోవాలి. కార్లలోని డీఫాగర్‌ను ముందుగానే ఆన్‌చేయాలి.
ప్రయాణ సమయంలో పొగ మంచు తీవ్రత పెరిగితే ఎక్కడబడితే అక్కడ వాహనాలు నిలపకుండా సురక్షిత ప్రాంతాలు, హైవే అథారిటీ ఏర్పాటు చేసిన రెస్ట్ ఏరియాల్లో పార్కింగ్ చేయాలి.
పొగమంచులో వెళ్లే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాల మీద దృష్టి సారిస్తూ చేతులను స్టీరింగ్ మీదనే ఉంచాలి. వాహన వేగం తగ్గించాలి. మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. వాహనచోదకులు గుర్తించే విధంగా వాహనాల హెడ్‌లైట్స్ ఆన్‌చేసి ఉండాలి.
మంచు కురుస్తున్న సమమంలో లో–బీమ్ హెడ్‌లైట్స్‌ను ఉపయోగించాలి. హై–బీమ్ హెడ్‌లైట్స్ ఆన్ చేస్తే మంచు తుంపర్లు రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ కారణంగా ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి టేల్ లైట్, బ్లింకర్స్‌ను ఉపయోగించడం వల్ల ఎదురుగా వస్తున్న వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ముందున్న వాహనానికి తగినంత దూరాన్ని పాటించాలి. అధిగమించే ప్రయత్నం చేయరాదు. దీంతో ఆ వాహనాలు పొరపాటున ప్రమాదానికి గురైతే వెంటనే మనం పక్కకు తప్పుకునే అవకాశం ఉంటుంది.
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినడం లాంటివి చేయకూడదు. వీటివల్ల బయటి శబ్దాలు వినిపించవు. విండోను కాస్తయినా డౌన్ చేస్తే బయట వాహనాల శబ్దాలు వినిపిస్తాయి.
పాలు, న్యూస్‌పేపర్ తరలించే వాహనాలు, వ్యవసాయ కూలీలను తీసుకెళ్లే ట్రాక్టర్లు, ఆటోలు, ప్రైవేటు బస్సులు వంటి వాటికి ఫాగ్‌లైట్స్ అమర్చుకోవడం మంచిది.
పొగమంచు వేళ జర భద్రం
పొగమంచు వేళ జర భద్రం


