కూలిన బ్రిడ్జి.. రాకపోకలకు అంతరాయం
అనుమసముద్రంపేట: మండలంలోని కావలియడవల్లి వద్ద ఉన్న బ్రిడ్జి గురువారం కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు మళ్లించినట్లు ఎస్సై సైదులు తెలిపారు. వివరాలు.. హసనాపురం నుంచి కలిగిరి వెళ్లే రహదారిలో కావలియడవల్లి వద్ద కాలువపై ఆర్‌అండ్‌బీకి చెందిన బ్రిడ్జి ఉంది. ఇది కూలడంతో కలిగిరి – పామూరుకు వెళ్లే వాహనాలను హసనాపురం, జమ్మవరం, గుంపర్లపాడు మీదుగా మళ్లించారు. బ్రిడ్జి కూలిపోయే అవకాశముందని తెలిసినా ఆర్‌అండ్‌బీ అధికారులు, కూటమి నేతలు పట్టించుకోలేదు. ఆ రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు సైతం ప్రమాదాలకు గురయ్యారు. ఇప్పటికైనా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కావలియడవల్లి, అక్బరాబాదు, హసనాపురం వాసులు కోరుతున్నారు.


