బాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: సీఎం చంద్రబాబు పాలనపై రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. కోటి సంతకాల సేకరణ పత్రాల వాహనాన్ని మండలంలోని సర్వేపల్లిలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకాణి మాట్లాడారు. పేద విద్యార్థులకు వైద్య విద్యనందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలను అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని వివరించారు. అయితే టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక, వీటిని ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకోవడం దారుణమని చెప్పారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూస్తుంటే, చంద్రబాబుపై వారిలో ఎలాంటి వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందని చెప్పారు. తమ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేస్తే, ప్రస్తుతం దేన్నీ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, వలంటీర్లకు రూ.పది వేలిస్తామని చెప్పి అందర్నీ వంచించారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ ఆర్భాటపు ప్రచారాలు చేసుకోవడం తప్ప ప్రజలకు చేసేందేమీలేదని ఎద్దేవా చేశారు. సంబంధం లేని విషయాన్ని మాట్లాడి రాష్ట్ర పరువును జాతీయ స్థాయిలో మంటగలిపారని విమర్శించారు.


