కలెక్టరేట్ ఎదుట ధర్నా
నెల్లూరు(దర్గామిట్ట): రైతుల సమస్యలపై కలెక్టరేట్ ఎదుట ధర్నాను సీపీఐ, రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి, రైతు సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షానవాజ్, గంగపట్నం రమణయ్య మాట్లాడారు. తుఫాన్ కారణంగా 14 వేల ఎకరాల్లో నారుమడులు.. 1.5 లక్షల ఎకరాల్లో వరినాట్లు.. దాదాపు 200 ఎకరాల్లో వేరుశనగ దెబ్బతిన్నాయని చెప్పారు. నార్లు పోసుకునేందుకు విత్తనాలు అందుబాటులో లేవని, అవసరమైన మేర సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకూ వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, దీనికి గానూ 6.7 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచుతామని చెప్పినా, ఆచరణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని చెప్పారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. నేతలు రామరాజు, వినోదమ్మ, సిరాజ్, రాజగోపాల్, దర్గాబాబు, ఏడుకొండలు, మున్నా, మస్తాన్, ఆదినారాయణ, వనజ తదితరులు పాల్గొన్నారు.


