ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం
● మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణను తిప్పికొడుతాం
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరు (స్టోన్‌హౌన్‌పేట): ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయకుండా ఏకపక్షంగా ముందుకు పోవడం దుర్మార్గమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు వీఆర్‌సీ సెంటర్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నిర్వహిస్తున్న కోటి సంతకాల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నగర నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మెడికల్ కళాశాలలను తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎకరా రూ.100లకు చొప్పున అప్పనంగా కట్టబెడుతూ ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారని మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునే దిశగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా పోరాడుతుందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునే దిశగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా ఉద్యమం చేపట్టేందుకు నిర్ణయించారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి ఆ పత్రులను గవర్నర్‌కు అందించి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా పోరాటం చేస్తామన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌తోపాటు వీఆర్సీ, గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరిని ఏకం చేసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను వివరించి మద్దతుగా సంతకాలు చేయిస్తామన్నారు. రాబోయే 20 రోజులపాటు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వరరెడ్డి, కార్పొరేటర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి, కరీముల్లా, నీలి రాఘవరావు, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హంజాహుస్సేని, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్, 11వ డివిజన్ ఇన్‌చార్జి మహేష్ యాదవ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


