
కన్నీటి గాథలు చెప్పి.. సాయం కోరి..
● అర్జీలు స్వీకరించిన ఎస్పీ అజిత వేజెండ్ల
● అండగా ఉంటానని భరోసా
● చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
నెల్లూరు(క్రైమ్): ‘ఉద్యోగం పేరిట మోసగించారు. పెళ్లి చేసుకుంటానని వంచించాడు. సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరిస్తున్నాడు. ఉద్యోగాలిప్పిస్తానని మోసగించారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. మోసగాళ్లపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 122 మంది వచ్చి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్, కావలి డీఎస్పీలు జి.శ్రీనివాసరావు, పి.శ్రీధర్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్‌బీ – 2 ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● నా ఆస్తిని పిల్లలకు పంచేశాను. నా జీవనోపాధి నిమిత్తం రూ.3 లక్షల నగదును దాచిపెట్టుకున్నాను. పెద్ద కుమార్తె ప్రమీల, ఆమె భర్త బలవంతంగా ఆ నగదును తీసుకున్నారు. నాకు వచ్చే వృద్ధాప్య పింఛన్‌ను సైతం లాక్కొంటున్నారు. నాకు పూటగడవడమే కష్టంగా ఉంది. విచారించి న్యాయం చేయాలని వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి కోరాడు.
● బుచ్చికి చెందిన కాలేషా నాతో సన్నిహితంగా ఉండేవాడు. చెప్పినట్ల వినకపోతే వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● వింజమూరుకు చెందిన హరేంద్ర నన్ను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. విచారించి న్యాయం చేయాలని ఉదయగిరికి చెందిన ఓ యువతి విజ్ఞప్తి చేశారు.
● నా కుమారుడు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌కు చెందిన అమీర్మియా, రేష్మ దంపతులు అతడికి హైదరాబాద్‌లోని ఎయిమ్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.13.60 లక్షలు నగదు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించలేదు. నగదు తిరిగివ్వడంలేదు. ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని నవాబుపేటకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
● చిత్తూరుకు చెందిన మంజునాథ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓనని నమ్మించాడు. తన కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.26.68 లక్షల తీసుకుని మోసగించాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని దగదర్తికి చెందిన ఓ యువకుడు కోరారు.
● భర్త, అత్తింటివారు అదనపుకట్నం కోసం వేధిస్తున్నారు. ప్రతి విషయానికి గొడవ పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.