
నిందితుల కోసం ముమ్మర గాలింపు
ఉదయగిరి: పట్టణంలో సంచలనం రేపిన మహమ్మద్ హమీద్ హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులు ఉమర్ అలీ, హనీఫ్‌ను పట్టుకునేందుకు గానూ రెండు ప్రత్యేక బృందాలను కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కావలి డీఎస్పీ శ్రీధర్ ఏర్పాటు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఈ హత్యలో పలువురి ప్రమేయం ఉండొచ్చనే కోణంలో విచారణ జరుపుతున్నారు. హత్యానంతరం స్కూటీలో గోదాము వరకెళ్లి, అక్కడ ఉంచిన కారులో పరారైన విషయంలో ఎవరెవరు సహకరించారనే కోణంలో ఆరాతీస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలోని ఓ రహస్య ప్రదేశంలో నిందితులు తలదాచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నిందితులను పోలీసులకు అప్పగించేందుకు ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన ఓ వ్యక్తి సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. రెండు రోజుల్లో లొంగిపోతారని ఓవైపు.. పోలీసుల అదుపులో ఇప్పటికే ఉన్నారనే ప్రచారమూ జరుగుతోంది.