
వ్యసనాలకు బానిసలై నేరాలు
● దోపిడీ ముఠా అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): వ్యసనాలకు బానిసలైన యువకులు వాటిని తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం ముఠాగా ఏర్పడి దోపిడీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. నగరంలోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం చంద్రబాబునగర్‌కు చెందిన విజయ్ అలియాస్ పుండా, సుధీర్, సిరాజ్, పోలీస్ కాలనీ ప్రాంతానికి చెందిన అనిల్, ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న సాయికుమార్ పెద్దగా చదువుకోలేదు. వ్యసనాలను తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం దోపిడీలకు తెరలేపారు. ఇందులో భాగంగా తల్పగిరికాలనీ సమీపంలో నాగేంద్ర అనే వ్యక్తిని కత్తులతో చంపుతామంటూ ఈ నెల 11వ తేదీ సాయంత్రం బెదిరించి అతని ఫోన్ పే ద్వారా రూ.ఐదు వేలను ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. విషయాన్ని బయట చెప్తే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రబాబునగర్ సమీపంలోని ఖాళీ ప్లాట్ల వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్సై నవీన్ తదితరులు పాల్గొన్నారు.