సాక్షిప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో టీడీపీ మూకలు సాగించిన విధ్వంసంపై ఎట్టకేలకు పోలీసు అధికారులు స్పందించారు. ఘటన జరిగి ఆరు రోజుల తర్వాత నెల్లూరు దర్గామిట్ట పోలీసులు నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆదివారం దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ రోశయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి అందుకు దారి తీసిన పరిస్థితుల వివరాలను ప్రసన్నకుమార్‌రెడ్డి నుంచి సేకరించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వారి ముఖ్య అనుచరుల ప్రోద్బలంతో ఈ నెల 7వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో టీడీపీ మూకలు మారణాయుధాలతో సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి అక్రమంగా చొరబడి విధ్వంసం సృష్టించారు. ప్రసన్నకుమార్‌రెడ్డిని చంపేస్తామని బెదిరించి ఇంట్లోని వారిపై దాడి చేశారు. ఇంటి గోడలు మినహా ప్రతి గదిలోని వస్తువులు, ఫర్నీచర్‌తో సహా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అదే రోజు అర్ధరాత్రి ప్రసన్న అనుమానితుల పేర్లను ఊటంకిస్తూ వేమిరెడ్డి దంపతులు తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని నగర డీఎస్పీ పి.సింధుప్రియకు ఫిర్యాదు చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే దర్గామిట్ట పోలీసులు జీడీ ఎంట్రీతో సరి పెట్టారు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసు అధికారులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తుండడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. మరో వైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని పోలీసు అధికారుల్లో భయం మొదలైంది. దీంతో ఎట్టకేలకు ఆరు రోజుల అనంతరం శనివారం రాత్రి 189(4), 329(4), 324(5), 332(సీ), 351(2), ఆర్/డబ్ల్యూ(5) 190 బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో అనుమానితుల పేర్లతోపాటు పాటు వేమిరెడ్డి దంపతుల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని పేర్కొన్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరచడం గమనార్హం.
ఆరో రోజుల తర్వాత నామమాత్రపు సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్
దాడికి పాల్పడిన నిందితుల పేర్లు ఇచ్చినా నమోదు చేయని వైనం
ఘటనా స్థలంలో వివరాల సేకరణ