వ్యక్తిగత పూచీకత్తుపై నిరంజన్‌రెడ్డి విడుదల
నెల్లూరు (లీగల్): గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో అభియోగం ఎదుర్కొంటున్న నిరంజన్‌రెడ్డి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఆయన్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2021లో అప్పటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకం ఫోర్జరీ చేసి సర్వేపల్లి జలాశయం నుంచి గ్రావెల్ తరలించారనే ఆరోపణలపై వెంకటాచలం పోలీసుస్టేషన్‌లో ఉదయ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఆ కేసులో వీరి పేర్లు తొలగించి, ఆ స్థానంలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితోపాటు ఆయన ముఖ్య అనుచరుడైన నిరంజన్‌రెడ్డి పేర్లను నమోదు చేసిన సిట్ అధికారులు శుక్రవారం బెంగళూరులో ఉన్న నిరంజన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించి అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం మాగుంటలేఅవుట్‌లోని సెకండ్ ఏజేఎఫ్‌ఎంసీ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి పాలమంగళం వినోద్ ఇంటి వద్ద హాజరు పరిచారు. సిట్ తరఫున స్పెషల్ పీపీ, నిరంజన్‌రెడ్డి తరఫున న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ రిపోర్టును తిరస్కరిస్తూ వ్యక్తిగత పూచీకత్తుపై నిరంజన్‌రెడ్డిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


