నీకు భర్త లేడని రుజువేది?
వెంకటాచలం: భర్త లేని ఒంటరి మహిళకు ఏడేళ్లుగా సామాజిక భద్రత పింఛన్‌ను ప్రభుత్వం అందజేస్తోంది. అయితే ఆమైపె కక్ష గట్టిన టీడీపీ నేతలు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి జూన్ నెల నుంచి పింఛన్ ఆపేశారు. నీకు భర్త లేడని రుజువేదని, సర్టిఫికెట్ తెచ్చి ఇస్తే పింఛన్ ఇస్తామంటూ సచివాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని వెంకటాచలానికి చెందిన గిరిజనురాలు దాసరి రాధ ఆవేదన వ్యక్తం చేసింది. ఒంటరి మహిళ అయిన తనకు చాలా ఏళ్ల నుంచి పింఛన్ వస్తుండగా, ఆ డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. జూన్ నెల పింఛన్ ఇవ్వకపోవడంతో గ్రామ సచివాలయం వద్దకు వెళ్లగా సర్టిఫికెట్ తీసుకు వస్తేనే పింఛన్ ఇస్తామని, లేదంటే టీడీపీ నేతలను కలిసి వారితో చెప్పించాలని చెప్పారని పేర్కొంది. స్థానిక టీడీపీ నాయకులు కొందరు రాజకీయ కక్షతోనే తనకు పింఛన్ ఇవ్వకుండా సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువచ్చి నిలిపివేయించారని ఆరోపించింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు పింఛన్ నగదు ఇప్పించాలని కోరుతోంది. ఈ విషయంపై ఎంపీడీఓ కల్పనతో సంప్రదించగా, తన దృష్టికి ఈ విషయం రాలేదని, విచారణ జరుపుతామని తెలిపారు.
ఒంటరి గిరిజన మహిళకు
పింఛన్ నిలిపివేత
ఏడేళ్లకు పైగా ఇస్తున్నారని..
టీడీపీ నేతల ఒత్తిడితోనే ఇప్పుడు
ఆపేశారంటూ ఆవేదన


