నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం

May 16 2025 12:08 AM | Updated on May 16 2025 12:08 AM

నేడు

నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం

నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం

వేలల్లో కేసులు

వైద్యశాఖ లెక్కల్లో నామమాత్రం

నెల్లూరు(అర్బన్‌): డెంగీ.. ఇది చాలా ప్రమాదకరం. ఆడ ఏడిస్‌ ఈజిప్టై అనే జాతికి చెందిన దోమ కుడితే వచ్చే ప్రమాదకరమైన జ్వరాల్లో ఒకటి. దోమ కుట్టినప్పుడు దాని లాలాజలంలో ఉండే వైరస్‌ మనిషి శరీరంలోనికి ప్రవేశించి ఈ వ్యాధిని కలిగిస్తుంది. దీనిని ఎముకలు విరిచే జ్వరం అని కూడా అంటారు. డెంగీ బారిన పడిన అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ జ్వరం రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించి వివరిస్తూ కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం మే 16వ తేదీని జాతీయ డెంగీ నివారణ దినోత్సవంగా ప్రకటించింది. జిల్లాలోనూ మలేరియా నివారణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఎన్నో కేసులు

సీజనల్‌ వ్యాధిగా పిలిచే డెంగీ జ్వరం జిల్లాలో ప్రతి సంవత్సరం వేలాది మందికి సోకుతోంది. ఎన్‌ఎస్‌1 ర్యాపిడ్‌ పరీక్ష ద్వారా ఈ జబ్బును నిర్ధారిస్తున్నారు. నెల్లూరులోని వివిధ హాస్పిటళ్లలో ప్రతి సంవత్సరం వేలాది కేసులు నమోదవుతున్నాయి. రెండు, మూడు వందల కేసులకు చికిత్స చేసిన ఆస్పత్రులున్నాయి. అయితే వైద్యశాఖ మాత్రం కాకి లెక్కలు చెబుతోంది. దాని గణాంకాల ప్రకారం 2022లో 148, 2023లో 193, 2024లో 130, 2025లో (ఏప్రిల్‌ వరకు) 16 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాపూరు, సీతారామపురం, ఉదయగిరి, కలువాయి, దుత్తలూరు, బోగోలు, కలిగిరి, ఆత్మకూరు, నెల్లూరు, కావలి రూరల్‌ తదితర ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా వచ్చినట్టు పేర్కొంటున్నారు. అన్ని పీహెచ్‌సీలతోపాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డెంగీని నిర్ధారించే ర్యాపిడ్‌ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్యశాఖాధికారులు మాత్రం ఆ పద్ధతిలో కాకుండా ఎలీసా పద్ధతిలో చేసే పరీక్షలను డెంగీగా నిర్ధారిస్తున్నారు. మిగతా వాటిని లెక్కల్లోకి తీసుకోవడం లేదు.

లక్షణాలు ఏంటంటే?

డెంగీ వ్యాధి సోకిన వారిలో కీళ్లు, కండరాల నొప్పులు, వికారం, వాంతులు, దద్దుర్లు, తలనొప్పి లక్షణాలుంటాయి. శరీరం విపరీతంగా నొప్పులకు గురవుతుంది. ఎక్కువ మందికి దానంతట అదే తగ్గిపోతుంది. అయి తే పలువురు ఆస్పత్రుల పాలవుతున్నారు. రక్తకణాలు తగ్గిపోతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. కడుపునొప్పి రావొచ్చు. మరికొన్ని లక్షణాలున్నాయి. పలువురికి వైద్య చికిత్సకే రూ.లక్షలు ఖర్చవుతాయి. ఆర్థికంగా చితికిపోతారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమవుతుంది.

సీజనల్‌ వ్యాధుల నివారణకు కృషి

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో డెంగీ, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధుల నివారణకు వైద్యశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ సూచించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో వైద్యశాఖ ఆధ్వర్యంలో బ్యానర్లు, వాల్‌పోస్టర్లను ఆనంద్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది డయేరియా, టైఫాయిడ్‌ లాంటి జ్వరాలు రాకుండా ఉండేందుకు ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. డెంగీపై ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన సూచనలివ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సుజాత, జిల్లా మలేరియా నివారణ అధికారి హుస్సేనమ్మ, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పీఓ డాక్టర్‌ రమేష్‌, డాక్టర్‌ బ్రహ్మనాయుడు, సహాయ మలేరియా అధికారి వి.నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక చర్యలు

జిల్లాలో డెంగీ కేసులు అదుపులో ఉన్నాయి. అక్కడక్కడా నమోదవుతున్నాయి. నివారణకు జిల్లా వైద్యశాఖ తరఫున ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఎక్కడైనా డెంగీ, మలేరియా లాంటి కేసులు నమోదైతే ఫీవర్‌ సర్వే, దోమ లార్వా సర్వే చేస్తున్నాం. మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం. పరసరాల్లో దోమల నివారణకు మలాథియాన్‌ స్ప్రే చేయిస్తున్నాం. వారానికి ఒకరోజు నీటి పాత్రలను ఎండబెట్టాలంటూ ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నీటి నిల్వ ఉన్న గుంతల్లో దోమల గుడ్లు తినే గంబూసియా చేపలు వదులుతున్నాం. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. వేసవిలో ప్రతి హాస్టళ్లలో దోమల నివారణకు మందును పిచికారీ చేయిస్తున్నాం.

– హుస్సేనమ్మ,

జిల్లా మలేరియా నివారణ అధికారి

నివారణ ముఖ్యం

డెంగీ వ్యాధిని నివారించాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరం. కొంచెం నీరు కూడా నిల్వ చేరకుండా చూడాలి. దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలి. కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేసుకుని దోమలు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. దోమతెరలు ఉపయోగించాలి. జ్వరం ఎలాంటిదైనా సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడాలి.

నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం 
1
1/4

నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం

నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం 
2
2/4

నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం

నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం 
3
3/4

నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం

నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం 
4
4/4

నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement