
నెల్లూరులో రియల్ అభివృద్ధి
నెల్లూరు(బారకాసు): రోడ్లు, విద్యుత్, రవాణా తదితర మౌలిక సదుపాయాలున్న ప్రాంతాలకే అభివృద్ధి విస్తరిస్తుంది. పరిశ్రమలు, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోతున్న నెల్లూరు అభివృద్ధి.. క్రమంగా చుట్టుపక్కల గ్రామాల మార్గంలో శరవేగంగా దూసు కెళ్తోంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో నెల్లూరు రూరల్ పరిధిలో రియల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రశాంత వాతావరణానికి నెల్లూరు పెట్టింది పేరు. నగరానికి చుట్టుపక్కల ఉన్న కోవూరు, ఇందుకూరుపేట, తోటప ల్లిగూడూరు, ముత్తుకూరు, జొన్నవాడ, వెంకటాచలం తదితర ప్రాంతాలు పాడిపంటలతో కళకళలాడుతాయి. నెల్లూరు తూర్పు ప్రాంతాలు కోనసీమను తలపిస్తాయి. అంతేకాకుండా సమీపంలో పెన్నా నది, బ్యారేజీ ఉండటంతో తాగునీటికి ఇబ్బంది లేదు. తీర ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టు, ఏపీ జెన్‌కోతో పాటు పలు అయిల్, విద్యుత్ పరిశ్రమలు మెండుగా ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టు నుంచి పది కిలోమీటర్ల సమీపంలో క్రిస్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోనూ అనేక పరిశ్రమలు రానున్నాయి. గూడూరు – వరగలి క్రాస్‌రోడ్డు నుంచి ఏర్పాటైన సాగరమాల హైవే ద్వారా చైన్నె, తిరుపతికి రెండు గంటలు.. బెంగళూరుకు ఐదు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. ఇలా అన్ని విధాలా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఓబులాపురం నుంచి కృష్ణపట్నం రైల్వే లైన్ వెంకటాచలం సమీపంలోనే వెళ్తోంది. పలు విద్యాసంస్థలతో పాటు ఇంజినీరింగ్ కళాశాలలు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో విద్య, ఉపాధి కోసం ఇతర ప్రాతాల నుంచి నెల్లూరుకు వలస వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో నగర జనాభా పది లక్షలకు చేరింది. దీనిబట్టి చూస్తే నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.
విరివిగా వెంచర్లు
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రియల్టర్లు ప్రజలకు అనుకూలంగా అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ వెంచర్లు వేస్తున్నారు. ఈ విషయంలో అనేక మంది రియల్టర్లు పోటీపడుతున్నారు. నగరంలో పార్కులు, మాళ్లు, వాణిజ్య సముదాయాలు, దేవాలయాలున్నాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల బదులు ప్రశాంతత కోసం నగరానికి కొంచెం దూర ప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో రవాణా సౌకర్యం పెరగడంతో పాటు ఆయా మార్గాల్లో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడ్డాయి. కార్పొరేషన్ పరిధిలోని జాతీయ రహదారి, పొదలకూరు రోడ్డులోని కొత్తూరు సమీపంలో కావేరినగర్ వెనుకవైపు నుడా అప్రూవల్‌తో కూడిన పలు వెంచర్లు ఉన్నాయి. ఆయా వెంచర్లలో అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ అందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్లను విక్రయిస్తున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే కోరికతో వీటిని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. వీరికి ఇబ్బందుల్లేకుండా వారి కోరిక మేరకే తక్కువ ధరలకే ఆకర్షణీయమైన అధునాతన భవనాలను నిర్మించిస్తున్నారు.