
సినిమాలపై మక్కువతో..
● డైరెక్టర్‌గా మారిన రాజుపాళెం కుర్రోడు
మర్రిపాడు: మండలంలోని చుంచులూరు రాజుపాళెం గ్రామానికి చెందిన యల్లంరాజు మోహన్‌రాజు, ఉమారాణి దంపతుల కుమారుడు రాకేష్ వర్మ సినిమా డైరెక్టర్‌గా మారాడు. బ్లైండ్ స్పాట్ అనే సినిమాకు రచయితగా, దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో నవీన్ చంద్ర, రాశీసింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామకృష్ణ వీరపనేని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తీశారు. ఈనెల 9వ తేదీన విడుదల కానుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాకేష్ వర్మకు సినిమాలంటే ఇష్టం. దీంతో హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు ఉమామహేశ్వరరావు సారథ్యంలో దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్టర్‌గా శిక్షణ పొందాడు. అనంతరం పలు షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించాడు. వాటిలో పానీపూరి అనే షార్ట్ ఫిల్మ్‌కు జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. రాకేష్ వర్మ దర్శకత్వం వహించిన తొలి చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో రాజుపాళెం, చుంచులూరు, పడమటినాయుడుపల్లి తదితర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.