
అక్రమ కేసును ఎత్తివేయాలి
● ఎస్పీకి జర్నలిస్టు సంఘాల
ఐక్యవేదిక వినతి
నెల్లూరు (క్రైమ్): కావలి రెండో పట్టణ పోలీసులు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక నాయకులు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కోరారు. ఈ మేరకు ఐక్యవేదిక నాయకులు, పలువురు జర్నలిస్టులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. అనంతరం ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులను బెదిరించే ధోరణితో ఉద్దేశ పూర్వకంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. అందుకు కావలి ఘటనే నిదర్శనమన్నారు. కావలి పట్టణంలో అమృత్ పథకం పైలాన్‌ను 2020 ఏప్రిల్ 10వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారన్నారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు కావలి రెండో పట్టణ పోలీసులు మరుసటి రోజు కేసు నమోదు చేసినా సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును మూసివేశారన్నారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల వైఫల్యాలను, అక్రమాలను ఎత్తి చూపుతున్నారన్న అక్కసుతో ఐదేళ్ల అనంతరం ఆ కేసును రీ ఓపన్ చేయించి పైలాన్ ధ్వంసం ఘటనతో ఎలాంటి సంబంధం లేని కావలి ‘సాక్షి’ ఆర్సీ ఇన్‌చార్జి కె. శ్రీనివాసరావు (కేఎస్), కె.మాలకొండయ్య, బి. వెంకటలక్ష్మీనారాయణ, వి. ప్రసాద్‌తోపాటు మరికొందరు జర్నలిస్టులను నిందితులుగా చేర్పించి 307 ఐపీసీ తదితర నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు నమోదు చేయించారన్నారు. ఆదివారం పోలీసులు హుటాహుటిన నలుగురు జర్నలిస్టులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. సమాజ హితం కోసం అహరహం పనిచేసే జర్నలిస్టులు హత్యాయత్నంకు పాల్పడినట్లు పేర్కొంటూ నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు పెట్టడం దారుణమన్నారు. పైలాన్ ధ్వంసం సమయంలో మీడియాలోలేని ప్రసాద్‌ను సైతం కేసులో నిందితుడిగా చేర్చడం అక్రమ కేసుకు తార్కాణంగా నిలుస్తోందన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి పూర్వాపరాలను విచారించి అక్రమ కేసును ఎత్తివేయాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక నాయకులు ఎ. జయప్రకాష్, సీహెచ్ మస్తాన్‌రెడ్డి, పి.బాలకృష్ణ, మునీంద్ర, పలువురు జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.