
జిల్లాలో మోస్తరు వర్షం
● ఈదురు గాలులకు నేలరాలిన మామిడి
నెల్లూరు (అర్బన్): మండువేసవిలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణం కాస్త చల్లబడింది. 3.45 గంటల ప్రాంతంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. నెల్లూరు నగరంలోని వీఆర్‌సీ, బీవీనగర్, కొత్తూరు, అయ్యప్పగుడి, బుజబుజనెల్లూరు, వేదాయపాళెం, వెంకటేశ్వరపురం ఇలా అన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాలు చిత్తడి, చిత్తడిగా మారాయి. పాదచారులు, వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. గాలులకు పలుచోట్ల ఫ్లెక్సీలు ఊడిపోయాయి. విద్యుత్ శాఖాధికారులు ముందస్తుగా సుమారు గంటపాటు పలుచోట్ల సరఫరాను నిలిపేశారు. దీంతో నీట్ రాస్తున్న విద్యార్థులు ఆయా సెంటర్లలో ఉక్కపోతతో ఇబ్బంది పడుతూ పరీక్షలు రాశారు. జిల్లాలో అల్లూరు, కొండాపురం, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, వెంకటాచలం, మనుబోలు, కోవూరు తదితర ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. కొమ్మి, సత్యవోలు, పార్లపల్లి, అగ్రహారం తదితర గ్రామాల్లో గాలి ఽఉధృతికి కొన్ని చోట్ల ఇళ్లలోని రేకులు ఎగిరిపోయాయి. గాలులకు పలు చోట్ల చేతికందిన మామిడి కాయలు రాలిపోయాయి. దీంతో రైతులకు నష్టం వాటిల్లింది. జరిగిన నష్టాన్ని ఉద్యాన శాఖాధికారులు సోమవారానికి అంచనా వేయనున్నారు.