కోవూరు: కోవూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కీలక అధికారి లంచాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తన పరిధిలో ఉన్న పంచాయతీల్లోని కార్యదర్శులను బెదిరించి లంచాలు తీసుకునేందుకు ఆకాశ రామన్న ఉత్తరాలు రాయిస్తూ.. విచారణ పేరు తో ముడుపులు గుంజుతున్నాడని ఆరోపణలు ఉన్నా యి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, నెల్లూరు అడ్రస్‌తో కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ కార్యదర్శి అవినీతికి పాల్పడినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖ కాపీలు కలకలం రేపుతున్నాయి. అందులో కనీసం తేదీని కూడా కనబరచకపోవడం గమనార్హం. ఫిర్యాదు కాపీ ఒకటే.. కానీ రెండు రకాలుగా ఉన్నాయి. 2025 ఫిబ్రవరి 10వ తేదీతో కలెక్టర్ కార్యాలయం, 2025 ఫిబ్రవరి 20వ తేదీతో జిల్లా పంచాయతీ కార్యాలయ ముద్రలు ఉన్న ఫిర్యాదు కాపీపై సదరు జూపూడి ప్రభాకర్ సంతకం లేదు. బయటపడిన మరో కాపీలో జూపూడి సంతకం చేసినట్లు ఉంది. ఈ రెండు కాపీలు చూస్తే ఫేక్ ఫిర్యా దులతోపాటు కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లను ఉపయోగించి సదరు అధికారి ఈ దారుణానికి పాల్ప డుతున్నట్లు సమాచారం. కలెక్టర్, డీపీఓలు విచారణకు ఆదేశించారంటూ ఆగమేఘాలపై సదరు అవినీతి అధికారే విచారణ పేరుతో పంచాయతీ కార్యదర్శిని వేధించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ సంబంధిత అధికారులు విచారణకు ఆదేశిస్తే.. ముందుగా ఆ ఫిర్యాదుల కాపీలు మండల పరిషత్ అధికారి కి రావాలి. ఎంపీడీఓకు కూడా తెలియకుండా సదరు అధికారి చేతికి వచ్చాయంటే.. ఇవి నకిలీ ఫిర్యాదులే అని అర్థమవుతోంది. సదరు అధికారి కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లను దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాజీ ఎమ్మెల్సీ జూపూడి పేరుతో వచ్చిన ఫిర్యాదులపై ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో తాను ఆ లేఖ రాయలేదని తన పేరు ఉపయోగించి ఫేక్ ఫిర్యాదులు సృష్టించిన వారిపై చర్యల నిమిత్తం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
కోవూరు ఎంపీడీఓ కార్యాలయ అధికారి ప్రమేయం ఉన్నట్లు అనుమానం
ఒకే ఫిర్యాదు కాపీ.. సంతకం లేకుండా.. సంతకంతో మరొకటి
సంతకం లేని కాపీపై కలెక్టర్
కార్యాలయ ముద్ర
కలెక్టర్, డీపీఓ కార్యాలయాల సీళ్లు తయారు చేసుకుని దుర్వినియోగం
పోలీసులకు ఫిర్యాదు చేయనున్న జూపూడి
జూపూడి పేరుతో నకిలీ ఫిర్యాదు