అభ్యంతరాలుంటే తెలియజేయండి | - | Sakshi
Sakshi News home page

అభ్యంతరాలుంటే తెలియజేయండి

Sep 22 2023 12:20 AM | Updated on Sep 22 2023 12:20 AM

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌   - Sakshi

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

పోలింగ్‌ కేంద్రాలపై సమీక్షలో

రాజకీయ పార్టీలకు కలెక్టర్‌ సూచన

నెల్లూరు (దర్గామిట్ట): ఓటర్ల జాబితా స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌లో భాగంగా జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల మార్పు, నూతన కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని ఎస్సార్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో ఓటర్ల జాబితా స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌–2024లో భాగంగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు, పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌, తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ వారాంతపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ ప్రక్రియపై ఏమైనా సూచనలు ఉంటే సంబంధిత ఈఆర్వోల దృష్టికి తీసుకురావాలని కోరారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిఽధిలో ప్రస్తుతం 2,303 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, కొత్తగా 8 పోలింగ్‌ కేంద్రాలను ప్రతిపాదించామని తెలిపారు. కొత్తగా కందుకూరు 2, కోవూరు 1, నెల్లూరు రూరల్‌ 3, సర్వేపల్లి నియోజకవర్గంలో 2 చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జిల్లాలో 1350 మంది ఓటర్లు కలిగిన పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైతే అదనపు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఈఆర్వోలను ఆదేశించారు. జిల్లాలో ఇంటింటి సర్వే ద్వారా పెండింగ్‌లోని ఓటరు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించి పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అందుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. డీఆర్వో వెంకటనారాయణమ్మ, ఈఆర్వోలు వికాస్‌ మర్మత్‌, మలోల, ఓబులేసు, ప్రేమ్‌కుమార్‌, శోభిక, కరుణకుమారి, శీనానాయక్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు టీ సురేంద్రబాబు, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, భువనేశ్వరప్రసాద్‌, బీ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సర్వేలో మెరుగైన స్థానం

కలెక్టర్‌కు విద్యాశాఖ

ముఖ్యకార్యదర్శి ప్రశంసలు

నెల్లూరు(దర్గామిట్ట): గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో సర్వేలో జిల్లా మెరుగైన స్థానంలో ఉండడంపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ను ప్రశంసించారు. గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మహిళల ఆరోగ్యం, పిల్లల సంక్షేమం, విద్య, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సరఫరా, మన బడి నాడు నేడు, గడప గడపకు మన ప్రభుత్వం పనుల పురోగతి, జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్నకు చెబుదాం కార్యక్రమాల అమలుపై సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణం నుంచి హాజరైన కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ను గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సర్వేలో నెల్లూరు జిల్లా మెరుగైన స్థానంలో ఉండడానికి జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను వివరించాలని విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ కోరారు. ఇందుకు కలెక్టర్‌ బదులిస్తూ జిల్లాలో 13790 క్లస్టర్లు ఉండగా 9,570 క్లస్టర్లలో వలంటీర్లతో 100 శాతం సర్వే చేపట్టామని తెలిపారు. డీఈఓ పర్యవేక్షణలో ఎంపీడీఓలు, ఎంఈఓలు, సీఆర్పీలకు బాధ్యతలు అప్పగించి సర్వేను పక్కాగా చేపట్టామని వివరించారు. వలస వెళ్లిన, వివాహం చేసుకున్న, నాలుగైదేళ్లుగా పాఠశాలలకు రాకుండా ఉన్న విద్యార్థులను గుర్తించి ఓపెన్‌ స్కూల్‌లో చేర్పించేలా చర్యలు చేపట్టామన్నారు. పదో తరగతి తప్పిన వారిని గుర్తించి దాతల సాయంతో పరీక్ష ఫీజులు కట్టించి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇప్పించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎంఈఓల ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు చైల్డ్‌ ఇన్‌ఫోలో విద్యార్థుల పూర్తి వివరాలు నమోదు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. బడి బయట ఉన్న విద్యార్థులు బడికి వచ్చేలా జిల్లాలో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, డీఈఓ గంగాభవాని, సమగ్ర శిక్ష ఏపీసీ ఉషారాణి, డీఎంహెచ్‌ఓ పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్‌ రమేష్‌నాథ్‌, ఐసీడీఎస్‌ పీడీ హేనాసుజన, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement