Womens World Cup 2022: ఇంగ్లండ్‌కు మరో పరాభవం.. దక్షిణాఫ్రికా అద్భుత విజయం

Womens ODI World Cup 2022: South Africa Beat England By 3 Wickets - Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు మరో పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలై, క్వార్టర్స్‌ చేరుకునే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌, ఇవాళ (మార్చి 14) దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పరాజయంపాలై మరోసారి భంగపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి దక్షిణాఫ్రికా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. ఓపెనర్ బ్యూమోంట్ (62), వికెట్ కీపర్ జోన్స్ (53) అర్ధ శతకాలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. సఫారీ బౌలర్‌ కాప్‌ (5/45) ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించింది. 

అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ లిజెల్లె లీ (9) వికెట్ కోల్పోయినప్పటికీ.. లారా వొల్వార్డ్ (77), తజ్మిన్ బ్రిట్స్‌ (23), కెప్టెన్ సూన్‌ లుస్ (36), మరిజన్నె కాప్ (32)ల బాధ్యాతయుతమైన ఇన్నింగ్స్‌ల కారణంగా మరో నాలుగు బంతులు ఉండగానే విజయతీరాలకు చేరింది. ఆఖర్లో త్రిష చెట్టి (11), షబ్రిమ్‌ ఇస్మాయిల్‌ (5)లు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును గెలిపించారు.

ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన కాప్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. ఇంగ్లండ్‌పై ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో  రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో  ఆసీస్ ఉండగా టీమిండియా మూడో స్థానంలో, ఆతరువాత న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ జట్లు వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాక్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. 
చదవండి: Virat Kohli: ‘కోహ్లిని మళ్లీ టెస్టు కెప్టెన్‌ చేయండి...’!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top