#TusharDeshpande: 550 పరుగుల మార్క్‌ దాటాడు.. ఎవరికి సాధ్యం కాని చెత్త రికార్డు

Tushar Deshpande Worst Record-2nd-Most expensive Bowling-IPL-Finals - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే బౌలింగ్‌లో చెత్త గణాంకాలను నమోదు చేశాడు. సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ వేసిన తుషార్‌ దేశ్‌పాండే 56 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

పాండే బౌలింగ్‌ను సాయి సుదర్శన్‌, సాహాలు చీల్చి చెండాడారు. తుషార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో సాయి సుదర్శన్‌ ఒక సిక్స్‌, మూడు ఫోర్లు సహా 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే తుషార్‌ దేశ్‌పాండే చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. 

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో వికెట్‌ లేకుండా అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా ఫెర్గూసన్‌తో కలిసి దేశ్‌పాండే నిలిచాడు. తొలి స్థానంలో షేన్‌ వాట్సన్‌-ఆర్‌సీబీ.. 4 ఓవర్లలో 61/0 (2016 ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్‌తో), రెండో స్థానంలో లోకీ ఫెర్గూసన్‌ కేకేఆర్‌.. 4 ఓవర్లలో 56/0(2021 సీఎస్‌కేతో ఫైనల్లో) ఉన్నారు.

ఈ నేపథ్యంలో మరో చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అత్యంత చెత్త బౌలర్‌గా తుషార్‌ దేశ్‌పాండే రికార్డులకెక్కాడు. ఈ సీజన్‌లో తుషార్‌ దేశ్‌పాండే 9.92 ఎకానమీ రేటుతో 564 పరుగులు సమర్పించుకొని ఓవరాల్‌గా తొలి స్థానంలో నిలిచాడు.

తుషార్‌ తర్వాత 2022 సీజన్‌లో ప్రసిద్‌ కృష్ణ 8.28 ఎకానమీతో 551 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. 2020 ఐపీఎల్‌ సీజన్‌లో కగిసో రబాడ 8.34 ఎకానమీతో 548 పరుగులు సమర్పించుకొని మూడో స్థానంలో, సిద్దార్థ్‌ కౌల్‌ 2018లో 8.28 ఎకానమీతో 547 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. ఐదోస్థానంలో డ్వేన్‌ బ్రావో 2018లో 9.96 ఎకానమీతో 533 పరుగులు సమర్పించుకున్నాడు.

చదవండి: ఐపీఎల్‌ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా చరిత్ర
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top